కాన్పు కోసం బలవంతంగా గర్భిణి తరలింపు
గూడెంకొత్తవీధి: నెలలు నిండిన గర్భిణి ఆస్పత్రికి రాను అని మొండికేయడంతో పలు శాఖల సిబ్బంది ఆమెను బలవంతంగా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గూడెంకొత్తవీధి మండలంలోని పందిరాయి కొత్తగూడెం(పీకే గూడెం) గ్రామానికి చెందిన గర్భిణిని కాన్పుకోసం ఆస్పత్రికి తరలించేందుకు వైద్యసిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడీ సిబ్బంది నానా హైరానా పడ్డారు. ఈఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పీకే గూడెం గ్రామానికి చెందిన గెమ్మెలికొసాయి నిండు గర్భిణి. నెలలు నిండినా ఇంటి వద్దే ఉన్నట్టు గుర్తించిన వైద్యసిబ్బంది ఈమెను పరీక్షించి ప్రసవం కోసం ఆస్పత్రికి రావాలని సూచించారు. ఆమెను గురువారం గూడెంకొత్తవీధి పీహెచ్‌సీకి తరలించారు. ప్రసవ తేదీ ముగియడంతోపాటు ఉమ్మనీరు పోతుండటాన్ని గుర్తించిన వైద్యులు అక్కడి నుంచి చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి పంపారు. అయితే అక్కడ ఉండకుండా, వైద్యసిబ్బందికి చెప్పకుండా భర్త కుసునోతో కలసి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న వైద్య, అంగన్‌వాడీ, సచివాలయ, పోలీసు సిబ్బంది శుక్రవారం గ్రామానికి వెళ్లారు. అంతా కలసి ఆమెకు నచ్చజెప్పి ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తుండగా భర్త వీరంగం సృష్టించాడు. నా భార్యను ఎక్కడికీ పంపేది లేదని, నన్ను కాదని ఆస్పత్రికి తీసుకువెళితే ఊరుకోబోనని దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగాడు. చివరకు వైద్యసిబ్బంది, అధికారులు గర్భిణిని బలవంతంగా అంబులెన్సులో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు.ఈకార్యక్రమంలో వైద్యులు వినయ్, అచ్యుత్, రెవెన్యూ, ఐసీడీఎస్ సిబ్బంది, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించిన భర్త
Comments
Please login to add a commentAdd a comment