విద్యకే తొలి ప్రాధాన్యం
● గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య చేరువ కావాలి ● వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య రాజశేఖర్
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన ఉపకులపతిగా ఆచార్య జి.పి.రాజశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వర్సిటీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, వర్సిటీ వ్యవస్థాపక ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వైస్ చాన్సలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాజశేఖర్ ఏయూలో అవినీతికి స్థానం లేదని ఇతర ఆచార్యుల సమక్షంలో విజిలెన్స్ ప్రతిజ్ఞ చేశారు. పరిశోధకులకు సంబంధించిన పలు దస్త్రాలపై ఆయన తొలి సంతకాలు చేశారు. అనంతరం ఏయూ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డీన్లు ఇతర అధికారులతో అకడమిక్ సెనేట్ మందిరంలో సమావేశమయ్యారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాజశేఖర్‌ను రిజిస్ట్రార్ ధనుంజయరావు పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వర్సిటీ విభాగాధిపతులు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఫ్రెండ్లీ వైస్ చాన్సలర్‌గా ఉంటా..
ఈ సందర్భంగా ఆచార్య రాజశేఖర్ విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా, అవినీతి రహితంగా పనిచేస్తామన్నారు. విద్యా కార్యక్రమాలకే తాను తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా ముందుకెళ్తామన్నారు. విద్యార్థులతో ఫ్రెండ్లీ వైస్ చాన్సలర్‌గానే ఉంటానని, వారు ఎప్పుడైనా తనను కలవవచ్చన్నారు.
వందేళ్ల ఉత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకం
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది సంవత్సరంలోకి వెళుతోందని, ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. వందేళ్ల ఉత్సవాల విజయవంతానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. వర్సిటీలో ఆచార్యుల కొరత ఉందని, అదే విధంగా నిధుల లేమి కూడా ఉందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ సమస్యను అధిగమించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పెద్ద పీట
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేస్తామని నూతన వీసీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉన్నత విద్య దిశగా నడిపించడానికి కృషి చేస్తామన్నారు. ఇందుకు బృహత్తరమైన కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పారు. ఏయూ ఉపకులపతి.. పదవిగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుంటానన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. ఏయూ జాతీయస్థాయిలో అభివృద్ధి సాధించడం, పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం తమ లక్ష్యమన్నారు. విద్యార్థుల కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాల తరహాలో లీడర్‌షిప్ అకాడమీ ఏర్పాటు దిశగా పని చేస్తామన్నారు. విశ్వవిద్యాలయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేయడం, ఇండస్ట్రియల్ కాంక్లేవ్‌లు నిర్వహిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment