1/70 చట్టంపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి
పాడేరు రూరల్: అసెంబ్లీ సమావేశాల్లో 1/70 చట్టంపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌చేసింది. జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్టు అఖిల పక్షం నాయకులు పొద్దు బాలదేవ్,రాధాకృష్ణ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని గతంలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 48 గంటల బంద్ నిర్వహించడంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. 1/70 చట్టాన్ని సవరించే ఆలోచన లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ సమయంలో ప్రకటించారని, అయితే అసెంబ్లీ వేదికగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌చేశారు. గిరిజనుల హక్కులు, చట్టాలను కాలరాస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో గిరిజన ప్రాంత ఖనిజ సంపద, అడవులను అంబానీ,అదానీలకు కట్టబెట్టే ఆలోచన విరమించుకోవాలన్నారు. ఆదివాసీల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జీవో నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని, గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు వంద శాతం ఆదివాసీలకు కల్పించాలని డిమాండ్‌చేశారు. ఎస్టీ ప్లాన్‌కు రూ.17 వేల కోట్లు కేటయించాలన్నారు. గిరిజన సలహామండలిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 6,7 తేదీల్లో పాడేరు ఐటీడీఏ వద్ద నిర్వహించే రిలే నిరాహార దీక్షలో ఆదివాసీ ఉద్యోగ,విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, మలమ్మ, అరుణ, శీలత,చిన్నారావు,రాజు,చంటిబాబు, లక్షమణ్‌రావు,సీత, చిన్నమి, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకుల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment