
అపూర్వ సమ్మేళనం
● 1970 –1995 వరకు చదువుకున్న 27 బ్యాచ్‌ల విద్యార్థుల సమావేశం ● పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్
నర్సీపట్నం: అక్కడ పాత మిత్రులు జ్ఞాపకాలు కలబోసుకున్నారు. సుమారు 30 ఏళ్ల నాటి ముచ్చట్లు చెప్పుకున్నారు. అప్పటి గురువులను స్మరించుకున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లి ఆర్సీఎం స్కూల్ 1970 నుంచి 1995 వరకు పదో తరగతి వరకు చదువుకున్న 27 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు స్కూల్ ప్రాంగణంలో మంగళవారం సమవేశమయ్యారు. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆద్యంతం అలరించింది. పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దశాబ్ధాల క్రితం నాటి స్నేహ బృందాలు కలుసుకున్నాయి. ఆనందోత్సాహాలతో సందడి చేసింది. ఈ పాఠశాలలో చదివి ఇంజినీర్లు, టీచర్లు, లాయర్లు, సాప్ట్‌వేర్ నిపుణులు, రాజకీయ ప్రముఖులు వంటి ఉన్నత స్థానాలకు ఎదిగిన వారంతా తమ పాత స్మృతులను నెమరవేసుకున్నారు. ఒకరి యోగక్షేమాలను ఒకరు అడిగి తెలుసుకున్నారు. తాము జీవితంలో ఎలా ఎదిగిందీ..ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పాఠశాల పరిస్థితులు, వాటి అభివృద్ధి గురించి ఆరా తీశారు. విద్యార్థుల ఉన్నతికి ఎనలేని కృషి చేసిన అప్పటి హెచ్‌ఎంలు ఇన్నయ్య, జోజిబాబు ఫాదర్స్ చిత్రపటాల వద్ద పూర్వ విద్యార్థుఽలు నివాళుర్పించారు. ఇద్దరు గురువులను స్మరించుకున్నారు. ఇద్దరు హెచ్‌ఎంలు, అప్పటి గురువులు అందించిన ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని వారి భావాలను వ్యక్త పరిచారు. పూర్వ విద్యార్థి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అపూర్వ సమ్మేళనంలో పాల్గొని, తోటి పూర్వ విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ఎమ్మెల్యేగా సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే గణేష్‌తో పూర్వ విద్యార్ధులు ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం పలువురు ప్రముఖులను సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యచరణను సభలో చదివి వినిపించారు. ఆర్థికంగా వెనకబడిన పూర్వ విద్యార్థులకు సహాయపడాలని కూడా పూర్వ విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. పలువురు గురువులను సన్మానించారు. 27 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు చదువులమ్మ ఒడిలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు.

అపూర్వ సమ్మేళనం

అపూర్వ సమ్మేళనం

అపూర్వ సమ్మేళనం