
భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం
పాడేరు: జిల్లాలో భూ సమస్యలను ప్రణాళికబద్ధంగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ సమస్యలపై గురువారం నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులు ఇప్పటికీ పూరిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలపై సీఎం దృష్టి సారించారని చెప్పారు. రెవెన్యూ అధికారులు గుర్తించిన సమస్యలను కేటగిరీల వారీగా విభజించి, నిబంధనల మేరకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. ఆర్వోఆర్, ఇనాం భూముల భూ స్థిరీకరణ, రీ సర్వే తదితర సమస్యలపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో తేడాలను సరిచేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో పద్మాలత, ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం పెరగాలి
పాడేరు : జిల్లా అభివృద్ధిలో లాభాపేక్షలేని సంస్థల భాగస్వామ్యం మరింత పెరగాలని కలెక్టర్, జిల్లా లాభాపేక్షలేని సంస్థల ఫోరం చైర్మన్ దినేష్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా లాభాపేక్ష లేని సంస్థల ఫోరం మొదటి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం లాభాపేక్ష లేని సంస్థల సహకారం పెరగాలన్నారు. జిల్లా స్థాయి ఫోరంతో పాటు ఎంపీడీవో నోడల్ అధికారిగా వివిధ సంస్థల సహకారంతో మండల స్థాయి ఫోరాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆయన లాభాపేక్ష లేని సంస్థల ప్రజెంటేషన్‌ను వీక్షించారు. సుమారు పది సంస్థలు చేస్తున్న, చేయబోతున్న కార్యకలాపాలను ఆయా సంస్థల ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ డబ్ల్యూ ఇన్‌చార్జి పీఎస్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఈవో బ్రహ్మాజీరావు, డీడబ్ల్యూ డీడీ రజనీ, స్కిల్ డెవలెప్‌మెంట్ అధికారి రోహిణి, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, డ్వామా పీడీ విద్యసాగర్, నీతి ఆయోగ్ ప్రతినిధులు నారాయణరెడ్డి, చైతన్యరెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్

భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం