
గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి
అనంతగిరి(అరకులోయటౌన్): రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. మండలంలోని భీంపోల్ పంచాయతీ సరియాపల్లి గ్రామంలో ఎటిరో వెంచర్ నిర్వాహకుడైన గిరిజనేతరుడు ఆక్రమించిన గిరిజనుల భూములను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఎన్.ఆర్.పురం, భీంపోల్, గుమ్మకోట, గురుగుబిల్లి, రొంపిల్లి పంచాయతీల్లోని గిరిజనుల భూములపై సమగ్ర విచారణ జరిపి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి రక్షణ కల్పించాలన్నారు. మామిడి రాధమ్మ, అప్పలకొండకు చెందిన భూమిలో ఫెన్సింగ్, అరటి తోటలను జేసీబీలతో ధ్వంసం చేశారని, రెవెన్యూ, పోలీసు అధికారులకు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్టు చెప్పారు. సర్వేపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ, సీలింగ్, గెడ్డ పోరంబోకు, ఢీ ఫారం భూములను గిరిజనేతరుడు తన ఆధీనంలో తీసుకొని, ఇష్టానుసారం రహదారులు, వంతెనలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఢీ పారం భూములను చదును చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. గిరిజనుల భూములు ఆక్రమిస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు పెరిగాయన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెం నాయుడు, అనిత తదితరుల పేర్లు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరిస్తున్నట్టు గిరిరైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ఆక్రమణదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతలకు గిరిజనులు ముఖ్యమా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముఖ్యమా బహిరంగంగా ప్రకటించాలన్నారు. గిరిజనుల భాములు అన్యాక్రాంతమవుతున్నాయని పలుమార్లు జిల్లా పరిషత్, పాడేరు ఐటీడీఏ సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోతోందన్నారు. దీర్ఘకాలంగా ఈ మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై న నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఐదు పంచాయతీల్లో సమగ్ర విచారణ జరిపి అన్యాక్రాంతమైన భూములను గిరిజనులకు అప్పగించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ భూముల వ్యవహారంపై కలెక్టర్ ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ దీసారి గంగరాజు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్.స్వామి, ఎంపీటీసీ శిరగాం అఽశోక్, నాయకులు తవిటి నాయుడు, కృష్ణమూర్తి, మహేష్, అప్పలకొండ, కన్నయ్య, అశ్వర్, రమణ తదితరులున్నారు.
మంత్రులు రామ్మోహన్, అనిత, అచ్చెం నాయుడు అండతో ఆక్రమణలు
నాన్ షెడ్యూల్ ఏరియా భూములపై సమగ్ర విచారణ జరపాలి
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు
అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం