అనకాపల్లి : నూతన జిల్లాగా ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రంగా మారిన అనకాపల్లికి వచ్చేందుకు ట్రాఫిక్ సమస్య లేకుండా లైన్ క్లియర్ అయ్యింది. విశాఖ–విజయవాడ జాతీయ రహదారి మీదుగా శశరవేగంగా అనకాపల్లి దగ్గరకు వచ్చినప్పటికీ, బైపాస్ జంక్షన్ నుంచి పట్టణంలోకి చేరడానికి గంటల సమయం పడేది. విజయవాడ వైపు, కోల్‌కతా వైపుగా వచ్చే వాహనాలు కూడా పట్టణంలోకి వచ్చే జాతీయ రహదారికి రావాల్సి వచ్చేది. దీంతో వాహనదారులకు ఇక్కట్లు ఎదురయ్యేవి. ఇకపై ఆ సమస్య లేదు. పట్టణంలోకి వచ్చే వాహనాలకు మాత్రమే ప్రవేశం కల్పించారు. మిగిలిన వాహనాలు నేరుగా ఆనందపురం రహదారి చేరుకునేలా లైన్ క్లియర్ చేశారు.
అటు విశాఖ, ఇటు సబ్బవరం ప్రాంతాల నుంచి అనకాపల్లి పట్టణంలోకి చేరాలంటే ఇదివరకు నరకయాతన పడాల్సి వచ్చేది. రెండురోడ్ల రహదారి ఆపై దుమ్ము ధూళితో పాటు ట్రాఫిక్ రద్దీ కారణంగా ద్విచక్ర, ఇతరత్రా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. విజయవాడ నుంచి కోల్‌కతా వైపుగా వెళ్లే వందలాది భారీ, సరకు రవాణా వాహనాల రాకపోకలతో అనకాపల్లి సుంకరమెట్ట, శంకరం వైపు గల రోడ్లు నిత్యం రద్దీగా ఉండేవి. సబ్బవరం నుంచి అనకాపల్లి, విశాఖ నుంచి అనకాపల్లి వచ్చే వాహనాలతో పాటు విజయవాడ నుంచి సబ్బవరం వైపుగా వచ్చే వాహనాలు పట్టణంలో సూర్యనారాయణస్వామి అలయం వై జంక్షన్ వద్ద ఇరుక్కుని గంటల పాటు నిత్య ట్రాఫిక్ జామ్ జరగడం పరిపాటిగా ఉండేది.
జాతీయ రహదారి అభివృద్ధితో ట్రాఫిక్ మళ్లింపు
అనకాపల్లి – ఆనందపురం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అత్యాధునిక టెక్నాలజీతో ఆరులైన్ల రోడ్డు అభివృద్ధి ఇటీవల పూర్తయింది. దీంతో విజయవాడ నుంచి వచ్చే వాహనాలు అనకాపల్లి పట్టణంలోకి రాకుండా నేరుగా అనకాపల్లి జంక్షన్ నుంచి శంకరం వద్ద ఏలేరు కాలువ వరకు పొలాల మధ్యలో వేసిన ఆరు లైన్ల రోడ్డుకు మళ్లించారు. కోల్‌కతా నుంచి వచ్చే వాహనాలు అనకాపల్లి పట్టణంలోకి రాకుండా ఇదే మార్గానికి మళ్లించారు. దీంతో శంకరం వద్ద నుంచి అనకాపల్లి, అనకాపల్లి బైపాస్ జంక్షన్ నుంచి పట్టణంలో వై.జంక్షన్ వరకు నిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ సమస్య పూర్తిగా సమసిపోయింది.
పరిసర గ్రామాలకు ఊరట
గ్రామీణ వాణిజ్య కేంద్రంగా పేరొందిన అనకాపల్లి పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో జనాభా వస్తుంటారు. దీంతో పాటు జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఏర్పాటవడం, వివిధ శాఖలకు చెందిన జిల్లా కేంద్రాలు కూడా పట్టణంలోనే ఉండడంతో మరింతగా జనాభా రాకపోకలు పెరిగాయి. పట్టణానికి ప్రధాన ముఖద్వారంగా ఉండే సుంకరమెట్ట రోడ్డు, శంకరం రోడ్డు నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తూ కేవలం పట్టణంలో పనులు ఉండేవారు మాత్రమే రాకపోకలు చేసేలా ఆయా శాఖలు మార్గం సుగుమం చేశారు. దీంతో అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ సమస్య సమసిపోయింది
పట్టణంలోకి చేరాలంటే బైపా స్ జంక్షన్ నుంచి సూర్యనారాయణస్వామి ఆలయం వరకు నిత్యం ట్రాఫిక్ సమస్యతో నరకయాతన పడాల్సి వచ్చేది. కానీ ఇటీవల బైపాస్ వద్ద భారీ వాహనాలు నేరుగా సబ్బవరం వైపు వెళ్తున్నాయి. దీంతో పట్టణంలోకి వచ్చే వాహనాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. –కొత్తపల్లి సూర్య, వాహనదారు
నేరుగా కళాశాలకు...
నేను రోజూ రేబాక గ్రామం నుంచి డైట్ కళాశాలకు అనకాపల్లి మీదుగా వెళ్లేవాడిని. అనకాపల్లి–ఆనందవపురం జాతీయ రహదారి విస్తరణతో శంకరం నుంచి నేరుగా బైపాస్ జంక్షన్‌కు వెళ్ళి కళాశాలకు చేరుకుంటున్నాను. పట్టణంలో నుంచి వెళ్లేటప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండేది. ఇప్పుడు సమస్య తీరింది.
–గోగాడ మోహన్, విద్యార్థి
ప్రమాదాలు తగ్గాయి..
జాతీయ రహదారి అభివృద్ధితో పట్టణంలో సుంకరమెట్ట రోడ్డు ట్రాఫిక్ సమస్య 90 శాతం తగ్గింది. ప్రమాదాల సంఖ్య కూడా బాగా తగ్గింది. వాహనదారులు రాకపోకలు సౌకర్యవంతంగా ఉంది. బైపాస్ నుంచి శంకరం వరకు జాతీయ రహదారి చేయడంతో అటువైపుగా వాహనాలు మళ్లించాం.
–టి.శ్రీను, ట్రాఫిక్ సీఐ, అనకాపల్లి
Comments
Please login to add a commentAdd a comment