మృతుడు పవన్ (ఫైల్ ఫోటో)
మునగపాక/అనకాపల్లి టౌన్ (విశాఖ): వేసవి సెలవుల్లో సరదాగా పిల్లలను స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు క్షణాల్లో కుమారుడిని కోల్పోయారు. భగవంతుడా.. ఏమిటీ ఘోరమని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మునగపాక మండలం అరబుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు బుధవారం ఈతకు దిగి, నీట మునిగారు. అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనలో అన్న రాపేటి పవన్ (8) తిరిగిరాని లోకాలకు చేరుకోగా తమ్ముడు చరణ్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. ఆటో డ్రైవర్ రాపేటి గంగునాయుడు (చంటి) దంపతులు వేసవి సెలవులు కావడంతో పిల్లలను తీసుకొని అనకాపల్లి బైపాస్ దరి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. తన పిల్లలకు ఈత నేర్పించేందుకు తండ్రి పూల్‌లోకి దిగారు. సరదాగా ఆడుకుంటున్న పిల్లలు అంతలోనే నీట మునిగి ప్రమాదానికి లోనయ్యారు. సంఘటన జరిగిన సమయంలో ఒడ్డున ఉన్న తల్లి మాధవి ఏం చేయలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కొంది.
కళ్లెదుటే చనిపోయిన కుమారుడిని చూసి బోరున విలపించడంతో స్థానికులు కూడా కంటతడి పెట్టారు. ఫిర్యాదు చేయకుండా పవన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో.. పట్టణ ఎస్‌ఐలు దివాకర్, సత్యనారాయణ, ఎస్.ప్రసాద్ అరబుపాలెం గ్రామానికి చేరుకొని పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. ఈ ఘటనతో అరబుపాలెంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment