అనకాపల్లి: తమ కుమారుడు బతకాలని ఎంతో మంది దేవుళ్లను కొలిచారు. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. చివరికి గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోరారు. ఇంతలో మృత్యువుతో పోరాడి ఓడిపోయిన అతడు కన్నుమూశాడు. దాంతో తన తల్లిదండ్రులకు గుండె కోత మిగిలింది. హృద్రోగి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు విరాళాలు సేకరిస్తున్న వారికి నిరాశ ఎదురైంది. ఈ చేదు వార్త తెలియడంతో మునగపాకలో విషాదం అలుముకుంది.
గ్రామస్తుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన దొడ్డి శ్రీను గణేష్, పార్వతి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు రామకృష్ణ ఆర్నెల్ల క్రితం నుంచి అనారోగ్యానికి గురయ్యాడు. నయం చేయడానికి తల్లిదండ్రులు పలు ఆస్పత్రులకు తిప్పారు. చివరకు అతడికి గుండెమార్పిడి చికిత్స చేయాలని గుర్తించారు. ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడని వైద్యులు తేల్చిచెప్పారు. ఇందుకోసం రూ.35 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సూచించారు.
అంత పెద్ద మొత్తం సమకూర్చి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేని రామకృష్ణ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే 20 రోజులుగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేర్ ఆస్పత్రిలో రామకృష్ణకు వైద్యం అందిస్తున్నారు. ఎలాగైనా అతడిని బతికించుకునేందుకు గ్రామ యువత, పెద్దలు విరాళాలు సేకరించేందుకు ముందుకొచ్చారు. ఆపరేషన్‌కు అవసరమయ్యే నగదును సమకూర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంతలో విధి వక్రించింది.
అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మద్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మునగపాక గ్రామస్తులు, యువకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి రామకృష్ణ ఆరోగ్య సమస్యను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ప్రాణంతో కొట్టుమిట్టాడిన రామకృష్ణ ఇక లేరన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment