జమ్మూకశ్మీర్ శ్రీనగర్‌లో గుండెపోటుతో మృతి
రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో విషాదం
సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
రాంబిల్లి (యలమంచిలి): దేశ రక్షణ రంగంలో జమ్మూ కశ్మీర్ శ్రీనగర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో మృతి చెందిన వీర జవాన్ హవల్దారు గంగిరెడ్ల శివశంకరరావు అంత్యక్రియలు గ్రామస్తులు, బంధువులు, తోటి ఆర్మీ అధికారుల అశ్రునయనాల మధ్య సోమవారం దిమిలి గ్రామంలో సైనిక లాంఛనాలతో ఘనంగా జరిగాయి. దిమిలి గ్రామానికి చెందిన గంగిరెడ్ల శివశంకరరావు ఈ నెల 1వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్ శ్రీనగర్ వద్ద ఆర్మీ యూనిట్‌లో విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై మృతి చెందారు. జవాను భౌతికకాయాన్ని సోమవారం ఉదయం స్వగ్రామం దిమిలి తీసుకువచ్చారు.
భౌతికకాయం ఉంచిన అంతిమయాత్ర రథాన్ని అచ్యుతాపురం ప్రధాన రహదారి గుండా వెంకటాపురం మీదుగా దిమిలి గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామస్తులు, బంధువులు దారిపొడవునా పూలు చల్లుకుంటూ సుమారు 15 కిలోమీటర్ల వరకు ద్విచక్రవాహనాలతో జవాను అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శివశంకర్ భౌతికకాయం వద్ద ఆర్మీ అధికారులు, నేవీ సిబ్బంది జాతీయ పతాకం ఉంచి, భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేసి ఘన నివాళులర్పించారు. శివశంకర్ చివరిసారిగా ధరించిన యూనిఫాం, జాతీయపతాకాన్ని భార్య కృష్ణవేణి (లక్ష్మి), తల్లిదండ్రులకు ఆర్మీ అధికారులు అందజేశారు.
అనంతరం ఆర్మీ అధికారులు, సుబేదార్ సుజన్‌సింగ్, ఆనంద్‌సింగ్, ఎన్.ఎస్.రాజ్‌కుమార్, జి.యోగానంద్ ఆధ్వర్యంలో నేవీ అధికారులు పరేడ్ నిర్వహించి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఘనంగా సైనికలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. మృతిచెందిన జవాన్ శివశంకర్‌కు భార్య కృష్ణవేణి, కుమార్తెలు జగదీశ్వరి, దివ్య, కుమారుడు యశ్వంత్, తండ్రి సన్యాసినాయుడు, తల్లి వరహాలు ఉన్నారు. ఆర్మీలో చేరి 23 సంవత్సరాలు గడిచి మరో ఏడాది సంవత్సరంలో హవల్దారుగా పదవీ విరమణ చేయాల్సి ఉన్న దశలో శివశంకర్ ఆకస్మిక మృతి గ్రామస్తులను విషాదంలో ముంచింది.
దసరా పండగకు స్వగ్రామం వచ్చి కుటుంబం, స్నేహితులతో ఆనందంగా గడిపి మేనకోడలి పెళ్లిని దగ్గర ఉండి జరిపించి మరలా విధులకు వెళ్లి రెండు వారాలు గడవక ముందే విగతజీవిగా తిరిగి రావడాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. వేలాది మంది ప్రజల అశ్రునయనాల మధ్య జవాన్ శివశంకర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండల వైస్ ఎంపీపీ కొట్టాపు శ్రీలక్ష్మి , మాజీ సైనికోద్యోగి వడ్డీ కాసులు, తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులు, న్యాయవాది కరణం శ్రీహరి, గ్రామ పెద్దలు, మాజీ ఆర్మీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment