కోటవురట్ల: తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తిరిగి వస్తూ.. పంచాయతీ కార్యదర్శి బి.సుబ్రహ్మణ్యం (62) కారులోనే గుండెపోటుతో మృతి చెందారు. కోటవురట్ల మేజర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన సోమవారం తన తల్లిని నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం తిరుగు పయనమై కారు ఎక్కి బయలుదేరే సమయంలో ఒక్కసారిగా సీటులో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
తల్లికి చికిత్స చేయించి తిరిగి వస్తూ తనయుడు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన స్వగ్రామం గొలుగొండ మండలం అమ్మపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన సుదీర్ఘ కాలం కోటవురట్లలో కార్యదర్శిగా పనిచేశారు. మరో 5 నెలల్లో ఉద్యోగ విరమణ చేయనుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సౌమ్యుడిగా, మంచి అధికారిగా అందరి మన్ననలు పొందిన ఆయన మృతితో కోటవురట్ల మండలంలోనూ విషాదం అలుముకుంది. సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment