మెగా.. దగా | - | Sakshi
Sakshi News home page

మెగా.. దగా

Published Tue, Nov 26 2024 2:19 AM | Last Updated on Tue, Nov 26 2024 2:19 AM

మెగా.

మెగా.. దగా

టీచర్లకు ప్రమోషన్ల కోత

మెగా డీఎస్సీ మాటేమోకానీ.. ఆ బూచితో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల ప్రమోషన్లకు కూటమి ప్రభుత్వం కోతపెడుతోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నెలవారీ ఉద్యోగోన్నతుల ప్రక్రియ ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి ఊసే లేదు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఉన్న మున్సిపల్‌ మేనేజ్‌మెంట్‌ స్కూళ్లలో అన్ని క్యాడర్లు కలిపి ఇటీవల 11 మందికి ప్రమోషన్లు ఇచ్చారు. డీఎస్సీ కోసం 109 ఖాళీలు చూపించగా.. వీటిలో 30 శాతం కోటా మేరకు ప్రమోషన్లు కల్పించాలి. ఈ విషయంలో జరిగిన తప్పిదాలతో మరోమారు ఖాళీల గుర్తింపుపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రోజుకో నిర్ణయం తీసుకుంటుండటంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

● మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై నీలినీడలు

● నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపులు

● ఉమ్మడి జిల్లాలో 734 ఖాళీల గుర్తింపు

● రోస్టర్‌ పాయింట్లు వెరిఫికేషన్‌ పేరిట తాత్సారం

● డీఎస్సీ కోసం పోస్టుల బ్లాక్‌, ఈ కారణంగా పదోన్నతులు కోల్పోతున్న టీచర్లు

● కూటమి ప్రభుత్వం రోజుకో ప్రకటనతో గందరగోళం

శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఇందిర భర్తతో పాటు విశాఖలో ఉంటోంది. ప్రైవేటు స్కూల్లో చేస్తున్న ఉద్యోగం మానేసి, విశాఖ వచ్చి ఆరు నెలలుగా డీఎస్సీకి సిద్ధమవుతోంది. ఇద్దరు పిల్లల్లో ఒకర్ని భర్త చూసుకుంటుండగా, చిన్నోడిని తల్లి వద్ద ఉంచేసి, ఎలాగైనా కొలువు సాధించాలని పట్టుదలతో చదువుతోంది. కానీ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఆలస్యమవుతుండటంతో ఒత్తిడికి గురికావల్సి వస్తోందని ఇందిర తెలిపింది. ఒక్క ఇందిరే కాదు విశాఖ సెంట్రల్‌ లైబ్రరీలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఏ ఒక్కరిని కదిపినా ఇదే మాట వినిపిస్తోంది.

విశాఖ విద్య : మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌ పైనే అని గొప్పలు చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్‌ మాత్రం ప్రకటించలేదు. ఈ నెల 6న నోటిఫికేషన్‌ జారీచేస్తారని అంతా అనుకున్నా మళ్లీ వాయిదా పడింది. ఇంతకీ ఈ విద్యా సంవత్సరంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఉంటుందో..? లేదోనన్న సందేహాలు కలుగుతున్నాయి. టెట్‌ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు డీఎస్సీ కోసం రేయింబవళ్లు సిద్ధమవుతున్నారు. కొంతమంది ప్రైవేటు స్కూళ్లలో చేస్తున్న కొలువు మానేసి.. డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అదిగో, ఇదిగో డీఎస్సీ అంటూ కాలయాపన చేస్తుండటంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఖాళీల గుర్తింపుపై కానరాని స్పష్టత

మెగా డీఎస్సీలో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లాకు 1,134 పోస్టులు భర్తీ చేయనున్నారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో మిగులు ఉపాధ్యాయులు ఉన్నారనే క్షేత్ర స్థాయి నివేదికలతో ప్రభుత్వం డైలమాలో పడింది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో 734 ఖాళీలున్నట్లుగా విద్యాశాఖాధికారులు లెక్క తేల్చారు. వీటిలో ఎస్జీటీ పోస్టులు 216 వరకు ఉన్నాయి. దీనిపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వకపోవటం, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీపై రోజుకో ప్రకటన చేస్తుండటంపై నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారు.

రోస్టర్‌ పాయింట్లతో రాద్ధాంతం

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసమని ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ఖాళీ పోస్టుల రోస్టర్‌ పాయింట్ల లెక్క తేల్చాలని ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్‌ మేనేజ్‌మెంట్‌లో రోస్టర్‌ పాయింట్ల వ్యవహారంతో ఇటీవల జరిగిన ప్రమోషన్ల ప్రక్రియలో పెద్ద రాద్ధాంతమే జరిగింది. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీపై కాలయాపన చేస్తున్న నేపథ్యంలోనే తేనెతుట్టెను కదుపుతోందని ఉపాధ్యాయులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖలో విలీనమైన సమయంలోనే మున్సిపల్‌ యాజమాన్య స్కూళ్లలో క్యాడర్‌ స్ట్రెంత్‌ వివరాలను స్థిరీకరించాల్సి ఉండగా, అప్పట్లో జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకోకపోవటంతో ఇప్పుడు సమస్యలొచ్చిపడ్డాయి.

ఆశతో ఎదురుచూస్తున్నాం..

డీఎస్సీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం. పద్మనాభం నుంచి విశాఖ వచ్చి రూమ్‌ తీసుకొని రాత్రిపగలనకుండా ఎంతో కష్టపడి చదువుతున్నాం. కోచింగ్‌ కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాం. ప్రతీ ఏడాది డీఎస్సీ ప్రకటించి, పోస్టులను భర్తీ చేయాలి. మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలి. – ప్రియాభవానీ,

ఎమ్మెస్సీ, ఎంఈడీ, పద్మనాభం

No comments yet. Be the first to comment!
Add a comment
మెగా.. దగా 1
1/1

మెగా.. దగా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement