యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్ కుమార్
విశాఖ విద్య: రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగాన్ని సాల్ట్ పథకం విచ్ఛిన్న దశకు తీసుకెళుతోందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్ కుమార్ డిమాండ్ చేశారు. డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన యూటీఎఫ్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాల్ట్ పథకం వల్ల ఒకటి, రెండు తరగతుల మారినటువంటి పాఠశాలల సంఖ్య 12 వేలకు పైగా ఉన్నాయని, అక్కడ చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కష్టంగా ఉందన్నారు.
జీవో నంబర్ 117 రద్దు చేసి నూతన జీవో కోసం చేస్తున్న కసరత్తుతో ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మూసివేత గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం సాల్ట్ పథకం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి ఆర్.మోహన్ రావు మాట్లాడుతూ సాల్ట్ పథకం వల్ల ప్రాథమిక పాఠశాలలు బలహీనపడితే భవిష్యత్‌లో ఉన్నత పాఠశాలలు కూడా బలహీనపడతాయన్నారు.
ఈ పథకం వల్ల రోజు వారి గణాంకాలు సేకరించాల్సి ఉందని, దీని వల్ల బోధనకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ఉపాధ్యాయులకు బోధనకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, విశాఖ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, టి.ఆర్.అంబేడ్కర్, కోశాధికారి రాంబాబు, సహాధ్యక్షుడు ఎన్.ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment