● శస్త్రచికిత్స చేసి, బయటకు తీసిన పశువైద్యుడు
తగరపువలస (విశాఖ): ఆనందపురం మండలం వేములవలసలో ఓ ఆవు పొట్ట నుంచి గురువారం 50 కిలోల పాలిథిన్‌ను పశువైద్యుడు బయటకు తీశారు. పాడి రైతు కోరాడ నాయుడుబాబుకు చెందిన ఈ ఆవు ఐదు రోజులుగా కడుపులో నొప్పి, మేత తినలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది.
ఇది గమనించిన రైతు ఆనందపురం పశువైద్యాధికారి అనిల్‌కుమార్‌ను సంప్రదించారు. ఆవును పరీక్షించి, రుమేనటమీ శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. గురువారం డాక్టర్, అతని బృందం శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆవు కడుపు నుంచి దాదాపు 50 కిలోల పాలిథిన్ కవర్లు, తాళ్లను వెలికితీశారు. పాలిథిన్ వ్యర్థాలు పశువులకు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన తెలియజేస్తుందని డాక్టర్ అన్నారు. పాలిథిన్ కారణంగా మూగజీవాలు మృత్యువాత పడకుండా ఉండాలంటే.. ప్రజలు పాలిథిన్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. పశువైద్య సిబ్బంది సుజాత, దుర్గ, లక్ష్మి, రమణ, సంతోష్, సాగర్, సుబ్రహ్మణ్యం, నర్సింగ్ డాక్టర్ అనిల్‌కుమార్‌కు సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment