పరిశ్రమలకు విద్యుదాఘాతం
వైఎస్సార్‌సీపీ హయాంలో పారిశ్రామిక పరుగులు
సాక్షి, అనకాపల్లి:
విద్యుత్ చార్జీల పాపం ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల పాలిట శాపంగా మారింది. అచ్యుతాపురం–పరవాడ సెజ్‌లో మొన్న అభిజిత్ ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమ మూతపడింది. ఇప్పుడు మరో ఫెర్రో పరిశ్రమ ‘రాజరాజేశ్వరి లలిత త్రిపురసుందరి’ మూసేందుకు సిద్ధంగా ఉంది. గతంలో మూతబడి ప్రొడక్షన్ లేకుండా సదరన్ బయో డీజిల్, డబ్ల్యూఎస్ పరిశ్రమలు ఉన్నాయి. ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలకు ప్రధాన ముడిసరకు విద్యుత్తే. సాధారణ ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమల్లో ఉత్పత్తి ఖర్చుల్లో 30 శాతం కరెంటుకే వెచ్చించాలి. ప్రస్తుతం యూనిట్‌కు చార్జ్ రూ.9.89 (సర్కారు డ్యూటీ, ట్రూ అప్ చార్జెస్, ఫ్యూయల్ చార్జెస్, ఎనర్జీ చార్జెస్ రూ.3.89లతోపాటు యూనిట్ చార్జ్ రూ.6 కలుపుకొని) వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ట్రూ అప్ చార్జీల పేరిట భారం పెరిగింది. ఒక టన్ను ఉత్పత్తికి 4000 నుంచి 4,500 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఫెర్రో సిలికాన్ వంటి ప్రత్యేక ఉత్పత్తుల్ని తయారు చేసే పరిశ్రమల్లో టన్నుకు 8,500 నుంచి 9 వేల యూనిట్ల విద్యుత్ కావాలి. కూటమి ప్రభుత్వం విద్యుత్ భారం పెంచడం, పరిశ్రమలకు సబ్సిడీ కల్పించకపోవడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. అందుకే పొరుగు రాష్ట్రాలు యూనిట్‌కు రూ.1.50 రాయితీ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు మొగ్గు చూపిస్తున్నారు.
ఉపాధి కోల్పోతున్న కార్మికులు
ప్రస్తుతం పరిశ్రమలు మూసేస్తున్న కారణంగా స్కిల్ ఉన్న సీనియర్ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పెయింటింగ్, సిమెంటు పనులు, హోటల్స్‌లో పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వయస్సు పైబడిన కార్మికులు మరో పరిశ్రమలో ఉపాధి లేక దిక్కుతోచని దుస్థితిలో రోడ్డున పడుతున్నారు. ప్రస్తుతం అచ్యుతాపురం సెజ్‌లో రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి ఫెర్రో అల్లాయిస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇందులో సుమారు 550 ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో గత నెలలోనే కర్మాగారానికి విద్యుత్ సరఫరాను ఈపీడీసీఎఎల్ అధికారులు నిలిపివేశారు. అప్పటి నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ బకాయిలు చెల్లించి కర్మాగారంలో ఉత్పత్తిని పునఃప్రారంభిస్తామని యాజమాన్యం చెప్పింది. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యం కర్మాగారంలో కొంత ముడిసరకుతోపాటు ఉత్పత్తి చేసిన సరకును కంటైనర్లతో బయటకు పంపించేందుకు సిద్ధపడుతోంది.
కూటమి ప్రభుత్వ వైఖరితో జిల్లాలో పరిశ్రమలు మూతపడుతున్నాయి. పెరిగిన విద్యుత్ భారం, తగ్గిన రాయితీలు, ఇతర కారణాలతో పొరుగు రాష్ట్రాలకు పోయేందుకు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నేటి వరకూ జిల్లాలో 4 భారీ పరిశ్రమలు, 30కు పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి నిలిపివేశాయి. వీటిలో పరవాడ–అచ్యుతాపురం సెజ్‌లో 2 ఫెర్రో పరిశ్రమలు, కశింకోట మండలం తేగాడలో క్రెబ్స్ బయో కెమికల్ పరిశ్రమ ఉన్నాయి. ఫెర్రో పరిశ్రమలు మూతపడడానికి విద్యుత్ భారమే కారణం. ఇంకా మరికొన్ని పరిశ్రమలు మూతపడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
పరిశ్రమలను, కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
కూటమి ప్రభుత్వం విధానాల కారణంగానే పరిశ్రమలు మూతపడుతున్నాయి. ప్రధానంగా ఫెర్రో ఎల్లాయ్స్ పరిశ్రమలు చావు దెబ్బ తిన్నాయి. చిన్న తరహా పరిశ్రమలు 30 వరకూ ప్రొడక్షన్ నిలిపివేశాయి. పరిశ్రమలకు, కార్మికులకు మద్దతుగా ప్రభుత్వం నిలవాలి. కొత్త పరిశ్రమలు తీసుకొస్తామని ఆర్భాటాలు కాకుండా ఈ ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను సక్రమంగా కార్మిక చట్టాలు, హక్కులు అమలయ్యేవిధంగా చేస్తే సరిపోతుంది. యాజమాన్యాలు కూడా కార్మికుల హక్కులకు అనుగుణంగా వ్యవహరించాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా పరిశ్రమలు మూసివేయకూడదు.
– గనిశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు
మోయలేని విద్యుత్ భారం
ఒక ఫెర్రో పరిశ్రమకు సగటున నెలకు రూ.50 కోట్ల వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. ఫెర్రో పరిశ్రమల యజమానుల సంఘం విజ్ఞప్తి మేరకు గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం యూనిట్‌కు రూ.7లు ఉన్న ధరను రూ.6లకు తగ్గించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్రూ అప్ చార్జీలు, ఇతర సుంకాల పేరిట ఒక్కో యూనిట్ కు రూ.3.89 పైసలు అదనంగా వసూలు చేస్తోంది. దీంతో యూనిట్‌కు రూ.9.89 చెల్లించాల్సి వస్తోంది. ఒక ఫెర్రో పరిశ్రమకు సాధారణంగా వచ్చే విద్యుత్ బిల్లు రూ.50 కోట్లకు అదనంగా రూ.28 కోట్లు చెల్లిస్తున్నారు. అంటే సగటున ఒక ఫెర్రో పరిశ్రమ నెలకు రూ.78 కోట్లు విద్యుత్ బిల్లు చెల్లిస్తోంది.
కూటమి ప్రభుత్వంలో 4 భారీ,
30కి పైగా చిన్న, మధ్యతరహా
పరిశ్రమలకు దెబ్బ
విద్యుత్ భారంతో మూసుకుపోతున్న ఫెర్రో పరిశ్రమలు
ఉపాధి కోల్పోతున్న
వేలాదిమంది కార్మికులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా పరుగులు పెట్టింది. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టే నాటికి జిల్లాలో 120 భారీ పరిశ్రమలున్నాయి. 2019 నుంచి 2023 వరకూ జిల్లాలో 35 భారీ పరిశ్రమలు, 221 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు నెలకొల్పారు. 2019లో 6 కంపెనీలు, 2020 నుంచి 2023 వరకూ రూ.15,425 కోట్లతో 28 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 14,114 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీంతో జిల్లాలో భారీ పరిశ్రమలు 155కు, ఎంఎస్‌ఎంఈలు 11,343కు చేరుకున్నాయి. అంతేకాకుండా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రొత్సహించడంలో భాగంగా అనకాపల్లి కోడూరు వద్ద భారీ ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధికి చేసేందుకు భూసేకరణ ప్రక్రియ కూడా చేపట్టింది. అదేవిధంగా చోడవరం నియోజకవర్గంలో కోమళ్లపూడిలో ఎస్‌ఈజెడ్ ఏర్పాటుతో పాటు తాజాగా కొత్తగా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కును, పూడిమడకలో హైడ్రోజన్ గ్రీన్ హబ్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. 2014లో గత టీడీపీ సర్కారు ఎగ్గొట్టిన రూ.962.05 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూడా చెల్లించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో రూ. 4483.71 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 85,785 మందికి ఉపాధి లభించింది. రూ.1,715.16 కోట్ల రాయితీలను, రూ.1,144 కోట్ల విలువైన విద్యుత్ రాయితీ ప్రోత్సాహకాలను నాటి ప్రభుత్వం పరిశ్రమలకు చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment