మోటారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో మోటారు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిరసన తెలిపారు. ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్, జిల్లా నాయకుడు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ మోటార్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఆటో, మోటారు కార్మికులకు వాహనాల కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు.
విడి భాగాల ధరలు తగ్గించాలన్నారు. 50 ఏళ్లు దాటిన మోటారు కార్మికులకు పింఛన్ సదుపాయం కల్పించాలన్నారు. తమ సమస్యల పరిష్కారానికి మోటార్ కార్మికులు ఐక్యంగా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమం జరగనుందని, ఈ కార్యక్రమానికి మోటారు కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కర పత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి లోవరాజు, ప్రతినిధులు జి.నారాయణరావు, కె.శ్రీను, నాగేశ్వరరావు, ఎస్.రమణ, సూరిబాబు, పి.కొండలరావు, ఎస్.సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment