కాపర్ చోరీ కేసులో 8 మంది అరెస్ట్
ఎంవీపీకాలనీ: ఎంవీపీకాలనీలో పలు చోట్ల డ్రిల్లింగ్ చేసి కాపర్ దొంగతనానికి పాల్పడిన కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు ద్వారకా క్రైం సీఐ చక్రధరరావు తెలిపారు. ఈ వివరాలను శుక్రవారం ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నగరంలో ఎనిమిదేళ్ల కిందట జరిగిన బీఎస్‌ఎన్‌ఎల్ పనుల్లో పెందుర్తికి చెందిన ఆసనాల పిట్టోడు(ఏ1), ఏలూరుకు చెందిన బి.శ్రీను, జి.గోవర్ధన్, బి.ఏడుకొండలు, బి.రాజు, సీహెచ్ దుర్గాప్రసాద్, డి.రాజేష్, బి.ప్రసాద్ పాల్గొన్నారు. కాపర్ వైర్‌తో కూడిన పనులు చేపట్టారు. ప్రస్తుతం ల్యాండ్ లైన్ సేవలు నిలిచిపోవడంతో ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో కాపర్ వైర్ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎంవీపీకాలనీలో రాత్రి పూట అండర్ గ్రౌండ్ డ్రిల్లింగ్ చేసి.. 800 మీటర్ల కాపర్ వైరు చోరీ చేశారు. దీనిపై బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి చుట్టురి మురళీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై బయటపడింది. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. 300 కిలోల కాపర్ వైరుతో పాటు టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment