అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయం దండగ.. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసువాల్సిందే.. వ్యవసాయానికి సబ్సిడీలు, రాయితీలు వృథా అంటూ రైతులను చిన్నచూపు చూశారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనికి తోడు ప్రకృతి కరుణ లేక 1995 నుంచి 2003 వరకు కరువు కరాళ నృత్యం చేయడంతో ‘అనంత’ రైతులు పొట్టచేత పట్టుకొని వలస బాట పట్టారు. సరిగ్గా అలాంటి సమయంలోనే నేనున్నానంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశాకిరణమయ్యారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని పండుగలా చేశారు. రైతును రాజుగా చేసిన వైఎస్సార్ జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా నిర్వహిస్తూ ఆ మహనీయున్ని స్మరిస్తోంది.
►బీమాతో ధీమా..
చంద్రబాబు హయాంలో లోపభూయిష్టంగా ఉన్న పంటల బీమాలో సమూలంగా మార్పు చేసి రైతులకు భరోసా ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందించారు. 2004–2009 మధ్య వైఎస్ హయాంలో వేరుశనగ రైతులకు పంటల బీమా కింద ఏకంగా రూ.1138 కోట్లు పరిహారం ఇచ్చారు. పంటకోత ఫలితాల ఆధారంగా పెద్ద ఎత్తున బీమా ఇవ్వడంతో అప్పట్లో రైతులు పండుగ చేసుకున్నారు. అలాగే ఇన్‌పుట్ సబ్సిడీ కింద మరో రూ.100 కోట్లు ఇచ్చారు.
►అనుబంధ రంగాలకు పెద్దపీట..
ఒక్క వ్యవసాయానికే పరిమితం కాకుండా అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్ల తోటలు, డ్రిప్, స్ప్రింక్లర్ల రైతులకు కూడా చేయూతను అందించడంతో ఈ రంగాలు కూడా గాడినపడ్డాయి. రూ.25 కోట్లు ఇచ్చి పశుక్రాంతి, జీవక్రాంతి కింద 50 శాతం రాయితీతో మేలుజాతి పశువులు, గేదెలు అందజేసి క్షీరవిప్లవానికి నాంది పలికారు. రూ.80 కోట్లు మేర సబ్సిడీ ఇవ్వడంతో 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో కొత్తగా పండ్లతోటలు విస్తరించాయి. రైతులకు బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. ఎస్సీ ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో సూక్ష్మసేద్యాన్ని భారీగా విస్తరించారు. వైఎస్ ఆరేళ్లకాలంలో రూ.280 కోట్లు బడ్జెట్ ఇవ్వడంతో కొత్తగా 1.13 లక్షల హెక్టార్లకు సరిపడా డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేశారు. మొత్తమ్మీద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ఏకంగా రూ.13 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి.
►రుణమాఫీతో అండ..
2008లో కరువు పరిస్థితులు ఉండటంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వైఎస్సార్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. 3,03,937 మంది రైతులకు చెందిన రూ.554.92 కోట్లు రుణాలు ఒకేవిడతలో మాఫీ చేశారు. అప్పటికే బ్యాంకులకు రుణాలు చెల్లించిన వారికి ప్రోత్సాహకాల కింద 3,61,269 మంది రైతులకు రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద రుణమాఫీ కింద 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్ల లబ్ధిచేకూరింది.
►రాయితీ విత్తనాలతో లబ్ధి..
ఏటా ఖరీఫ్, రబీలో రైతులు ఇబ్బంది పడకుండా లక్షల క్వింటాళ్లు వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు రాయితీతో ఇచ్చారు. 2004 నుంచి 2009 వరకు ఆరేళ్ల కాలంలో 28,05,901 మంది రైతులకు రూ.280.88 కోట్ల రాయితీతో 26,02,717 క్వింటాళ్లు వేరుశనగ పంపిణీ చేశారు. కంది, ఆముదం లాంటి ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు.
వైఎస్సార్‌ను మరువలేం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలను రైతులెవరూ మరువలేరు. ఆయన పాలనలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పంటలు పండాయి. పండకపోయినా నష్టపరిహారం ఇచ్చి ఆదుకుని కరువు కాటకాలను గట్టెక్కించిన గొప్ప నాయకుడు. అనుకున్న సమయానికి రాయితీతో విత్తనాలు, ఎరువులు, డ్రిప్ పరికరాలు ఇచ్చారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఇప్పుడు వైఎస్ జగన్ ఇంకా ఎక్కువగానే మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.
– గొంచికారి కరియన్న, కై రేవు, శెట్టూరు.

Comments
Please login to add a commentAdd a comment