మారెన్న మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ శ్రీనివాసరావు
అనంతపురం: మండలంలోని అండేపల్లి గ్రామానికి చెందిన హోంగార్డు ఎర్ర మారెన్న (41) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను తోటి సిబ్బంది వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య నాగమణి, ముగ్గురు కుమారైలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ కె.శ్రీనివాసరావు బుధవారం ఉదయం అండేపల్లి గ్రామానికి చేరుకుని బాధత కుటుంబసభ్యులను పరామర్శించారు. మారెన్న మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మారెన్న భార్య నాగమణికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని భరోసానిచ్చారు. అంత్యక్రియలకు రూ.10 వేల తక్షణ సాయాన్ని అందజేశారు. అలాగే హోంగార్డు వెల్పేర్ అసోసియేషన్ తరపున రూ.10 వేల ఆర్థిక సాయాన్ని డీఎస్పీ బి.శ్రీనివాసులు అందజేశారు.
కార్యక్రమంలో సీఐలు లక్ష్మణ, శ్రీనివాసులు, ఎస్‌ఐలు రాజేష్, సుధాకర్, ఆర్‌ఎస్‌ఐ మక్బూల్, హోంగార్డు ఇన్‌చార్జ్ ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మారెన్న మృతదేహానికి రాష్ట్ర జానపద, సృజనాత్మక ఆకాడమీ డైరెక్టర్ బాబురెడ్డి, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్, సచివాలయ మండల కన్వీనర్ సాకే గంగాధర్, ఎంపీటీసీ మల్లేష్ ఘనంగా నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment