అనంతపురం: కారును వేగంగా వెనక్కు తీస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం ఎం.రాంపురం గ్రామానికి చెందిన దస్తగిరి, నజ్మూన్ దంపతులు ఆరేళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. నగర శివారులోని చంద్రబాబు కొట్టాలలో నివాసముంటున్న వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఆసీఫ్ (15 నెలలు) ఉన్నారు. ఏటీఎం క్యాష్ డిపాజిట్ చేసే ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన వాహనానికి దస్తగిరి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
బుధవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బయలుదేరిన తండ్రి వెంట ఆసీఫ్ పడ్డాడు. తాను కూడా వెంట వస్తానని మారాం చేశాడు. అతి కష్టంపై కుమారుడికి నచ్చచెప్పి దస్తగిరి వెళ్లిపోయాడు. దీంతో రోడ్డుపై నిలబడి తండ్రి వెళుతున్న వైపే దీనంగా చూస్తూ ఆసీఫ్ నిల్చుండిపోయాడు. అదే సమయంలో దస్తగిరి ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న ఫ్రూట్స్ మండీ మేసీ్త్ర రఘు కారును అతని మిత్రుడు తీసుకెళ్లే ప్రయత్నంలో రివర్స్ గేర్‌లో వెనకకు వచ్చాడు.
ఇరుకు సందులో రోడ్డుపై చిన్నారి నిలబడిన విషయాన్ని గుర్తించలేక వేగంగా వెనకకు దూసుకొచ్చాడు. ఘటనలో కారు ఢీకొనడంతో ఆసీఫ్ కిందపడ్డాడు. చిన్నారి తలమీదుగా కారు వెనుక చక్రం దూసుకెళ్లింది. అదే సమయంలో తల్లి నజ్మూన్ గట్టిగా కేకలు వేయడంతో వాహనాన్ని నిలిపి డ్రైవర్ పరారయ్యాడు.
సమాచారం అందుకున్న ట్రాఫిక్, అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా బాధిత కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ప్రమాదానికి కారకులైన వారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటి ముందు గొయ్యి తవ్వి అక్కడే తమ బిడ్డను ఖననం చేస్తామని చెప్పడంతో పోలీసులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబసభ్యులకు సర్దిచెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment