అనంతపురం సిటీ: ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైలుకు అనంతపురంలో అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు అనంతపురం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఎంపీ తలారి రంగయ్య, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుమతి సురతాని, ప్రజలు, విద్యార్థులు రైల్వేస్టేషన్ చేరుకుని రైలుకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కొందరు త్రివర్ణ పతాకం ఎగురవేసి జాతీయభావాన్ని ప్రదర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రైలు వద్ద గ్రూపు ఫొటోలు దిగారు. ప్రయాణికులు, భారీగా తరలివచ్చిన సందర్శకులు సెల్ఫీలు దిగడంతో పాటు రైలును తాకుతూ, ముద్దాడుతూ ఆనందం పంచుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ‘వందే భారత్’ రైళ్లలో ప్రయాణం చేస్తే సమయం ఆదా అవుతుందని, వీటిని ఆదరించాలని ఎంపీ రంగయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, డీఆర్‌ఎం మనీష్ అగర్వాల్, అనంతపురం స్టేషన్ మేనేజర్ అశోక్‌కుమార్ నాయుడు కోరారు.
► వందే భారత్ రాకను పురస్కరించుకొని అనంతపురంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జాతీయ భావాన్ని పెంపొందించేలా విద్యార్థినులు చేసిన నృత్యాలు కట్టిపడేశాయి.
► ‘వందే భారత్’ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులతో పాటు వీఐపీలు, విలేకర్లు, ప్రముఖులకు రైల్వే అధికారులు బోర్డింగ్ పాసులు పాసులు ఉచితంగా అందజేశారు. ఎనిమిది కోచ్‌లతో వచ్చిన ఈ రైలులో పాసులున్న వారు అనంతపురం నుంచి ధర్మవరం వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. అక్కడి నుంచి తిరిగి రావడానికి మరో రైలులో వారందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment