
సమావేశమైన టీడీపీ అసమ్మతి నేతలు
సాక్షి, పుట్టపర్తి: పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇస్తే పని చేసేది లేదని అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం పుట్టపర్తిలోని శిల్పారామంలో అసమ్మతి నేతలందరూ సమావేశమయ్యారు. కొండకమర్ల అల్లాబకష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆదర్శ పాఠశాలల అధినేత పెదరాసు సుబ్రహ్మణ్యం, దళవాయి వెంకట నారాయణ, మల్లెల జయరాం, వడ్డే సిమెంట్ పోలన్న, పీసీ గంగన్న తదితరులు పాల్గొని.. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేశారు.
తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలసి పని చేస్తామని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అంతేకానీ ఎవరికి పడితే వారికి టికెట్ ఇస్తే పని చేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు. త్వరలోనే ఆశావహులందరూ కలసి ఒక సమూహంగా ఏర్పడి గ్రామగ్రామానికీ వెళ్తామన్నారు. సమావేశంలో చింతమానిపల్లి లక్ష్మీపతి నాయుడు, శ్రీ సత్యసాయి జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జరిపిటి కృష్ణమూర్తి, దిగుపల్లి రఘురాం రెడ్డి, ఓడీసీ మాజీ ఎంపీపీ ఇస్మాయిల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వడ్డెర సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పల్లపు జయచంద్ర మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు దండగల మారెప్ప తదితరులు పాల్గొన్నారు.