పథకాలు దూరం చేసేందుకే ‘భూ ఆధార్’
అనంతపురం అర్బన్: రైతులకు సంక్షేమ ఫలాలు దూరం చేసేందుకే రైతు విశిష్ట సంఖ్య (భూ ఆధార్) నమోదుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, వెంటనే ఈ ప్రక్రియను ఆపేయాలంటూ కూటమి సర్కార్‌ను సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆగమేఘాలపై రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే గడువు నిర్దేశించి, ఈ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. భూ ఆధార్ నమోదు చేసుకున్న వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం, పంటల బీమా వంటి సంక్షేమ పథకాలు వర్తిస్తాయని, నమోదు చేసుకోకపోతే పథకాలు వర్తించవంటూ ఓ విధంగా రైతులను రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. జిల్లాలో 70 శాతం మంది రైతులు ప్రభుత్వం నుంచి అసైన్‌మెంట్ భూములను పొందినవారే ఉన్నారన్నారు. భూ ఆధార్ నమోదు ప్రక్రియతో వీరంతా తీవ్రంగా నష్టపోతారన్నారు. భూమి లేని లక్షల మంది కౌలురైతులకు ఎలాంటి గుర్తింపు ఉండదన్నారు. వీరికి సంక్షేమ పథకాలు వర్తించవన్నారు. అలాగే చుక్కల భూములు ఉన్న రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చూపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు రక్షణ కల్పించాలని నల్లప్ప డిమాండ్ చేశారు. విద్యార్థులకు రక్షణ కల్పించడంలో, సమస్యల పరిష్కారంలో విఫలమైన వీసీని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
నమోదు ప్రక్రియను వెంటనే ఆపేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment