రుణ మంజూరులో ఎందుకింత నిర్లక్ష్యం?
అనంతపురం సిటీ: తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా, పదేపదే చెబుతున్నా బ్యాంకర్ల పని తీరులో మార్పు రావడం లేదని కలెక్టర్ వినోద్‌కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ డీపీఆర్‌సీ భవన్‌లో మంగళవారం జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ విద్యా రుణాలకు సంబంధించి యూకో బ్యాంక్ 109 మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, కేవలం ముగ్గురికి మంజూరు చేయడం చూస్తే బ్యాంకర్ల పని తీరు ఎలా ఉందో ఇట్టే అర్థమైపోతుందన్నారు. స్టాండప్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి కేవలం 39.34 శాతం రుణాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే ఆయా శాఖల ఉన్నతాధికారులకు లేఖలు రాస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కింద రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఆయా పథకాల కింద లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లతో తరచూ సమీక్షలు చేయాలని ఎల్‌డీఎం, జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పశుసంవర్ధక, మత్స్య శాఖలకు చెందిన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందజేయాలని సూచించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీ కోసం ప్రభుత్వం లక్ష్యాలను కేటాయించిందని, గడువులోగా రుణాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో 34 బ్యాంకులకు సంబంధించి 290 బ్రాంచీలు ఉండగా, 51 గ్రామాల్లో ఆర్‌ఓ ప్లాంట్ల కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి, ఏర్పాటయ్యేలా చూడాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. రైతులకు విరివిగా పంట రుణాలు అందించి, వారికి మేలు చేసేలా చొరవ చూపాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల సౌకర్యార్థం మినీ బస్సు ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు.
గిట్టుబాటుపై ఒత్తిడి తీసుకురండి
జిల్లాలో మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతు సంఘం నాయకులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కోరారు. ఖరీఫ్, రబీ పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించి బాధిత రైతులతో పాటు కౌలు రైతులనూ ఆదుకోవాలని కోరుతూ ఎంపీకి వినతిపత్రం అందజేశారు.
బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ వినోద్‌కుమార్ అసహనం
Comments
Please login to add a commentAdd a comment