సిలిండర్ డెలివరీపై అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు
అనంతపురం అర్బన్: వంటగ్యాస్ వినియోగదారుల నుంచి డెలివరీబాయ్స్ అదనపు రుసుము వసూలు చేస్తున్నారు. సిలిండర్ నికర ధరపై అదనంగా డబ్బు వసూలు చేయరాదు. డెలివరీ బాయ్స్ మాత్రం ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కంపెనీల నుంచి తగిన పైకం వస్తున్నప్పటికీ వినియోగదారుల నుంచి అక్రమంగా సరాసరి రూ.30 దాకా వసూలు చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తం చూసేందుకు చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ జిల్లావ్యాప్తంగా రోజువారీగా డెలివరీ అవుతున్న సిలిండర్లపై అదనపు వసూలు మొత్తం చూస్తే ఔరా అనక తప్పదు. జిల్లా వ్యాప్తంగా 50 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,65,246 గృహావసర వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రోజువారీగా దాదాపు 12 వేల సిలిండర్లు డెలివరీ అవుతున్నాయి. ఒక్కొక్క సిలిండర్ నుంచి అదనంగా రూ.30 చొప్పున రోజుకు 3.60 లక్షలుగా నెలసరి రూ.1.08 కోట్లు అదనపు సొమ్ము వసూలు జరగుతోందంటే ‘కనెక్షన్ల’ డెలివరీలో వారి ‘కలెక్షన్’ ఎంత ‘స్ట్రాంగ్’ అనేది స్పష్టమవుతోంది.
అదనపు బాదుడే బాదుడు..
గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.870 ఉంది. అయితే సిలిండర్‌ఽ నికర ధరతో సంబంధం లేకుండా బిల్లుపై వినియోగదారుల నుంచి డెలివరీ బాయ్స్ రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. కొందరి వద్ద నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. డెలివరీ బాయ్స్ అడిగినంత ఇవ్వకపోతే వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. సిలిండర్ మంజూరైనా డెలివరీ చేయరు. ‘డోర్ లాక్’ అని చెప్పి ఏజెన్సీకి సిలిండర్‌ను వెనక్కిచ్చేస్తారు. ఇలా చేయడం వల్ల సిలిండర్ బుకింగ్ రద్దవుతుంది. దీంతో మరోమారు వినియోగదారు బుక్ చేయాలి. ఇలా రెండు మూడు దఫాలు ఇబ్బందికి గురిచేస్తారు. దీంతో ఈ తిప్పలు పడలేక వినియోగదారులు తప్పని పరిస్థితిలో సిలిండర్‌పై వారు అడిగిన అదనపు మొత్తాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది.
గ్యాస్ డెలివరీ బాయ్స్ నిర్వాకం
సిలిండర్‌పై ఆదనంగా
రూ.30 వసూలు
జిల్లాలో రోజూ 12 వేల
సిలిండర్ల డెలివరీ
ప్రతి నెలా అదనపు వసూళ్లు
రూ.1.08 కోట్లు
అదనంగా వసూలు చేస్తే చర్యలు
నిబంధనల ప్రకారం సిలిండర్ నికర ధరపై అదనంగా వసూలు చేయకూడదు. ఇప్పటికే ఈ విషయంపై ఏజెన్సీల నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. అధికారులను ఏజెన్సీలకు పంపించి తనిఖీ చేయిస్తున్నాం. అదనంగా వసూలు చేస్తున్న బాయ్స్‌పైన, సంబంధిత ఏజెన్సీపైనా చర్యలు తీసుకుంటాం. సిలిండర్ డెలివరీ క్రమంలో బాయ్స్ అదనంగా డబ్బులు వసూలుపై వినియోదారులు ఫిర్యాదు చేయాలి.
– శివ్ నారాయణ్ శర్మ, జాయింట్ కలెక్టర్
సిలిండర్ డెలివరీపై అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు
సిలిండర్ డెలివరీపై అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment