ప్రశ్నపత్రాల లీకేజీలో 14 మంది నిందితులు!
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగానికి సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం మరో దఫా తెరమీదకు వచ్చింది. ఈ కేసు విచారణ సీఐడీ కోర్టుకు రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాలు... 2011, నవంబర్‌లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్కేయూ దూరవిద్య విభాగంలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో దూరవిద్య విభాగం డైరెక్టర్‌గా ప్రొఫెసర్ పసల సుధాకర్ ఉండేవారు. 32 వేల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రకాశం జిల్లా పొదిలి పొరుగున ఉన్న అధ్యయన కేంద్రం నిర్వాహకులు పరీక్ష కేంద్రం కావాలని అప్పట్లో పట్టుబట్టారు. ఈ అభ్యర్థనను దూరవిద్యా కేంద్రం అధికారులు తిరస్కరిస్తూ పొదిలి కేంద్రంలో పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే 2011, నవంబర్ 23న జరగాల్సిన పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం అదే నెల 22న బయటకు వచ్చింది. కొన్ని ప్రశ్న పత్రాలు ముందు రోజే తీసి ఉద్ధేశ్యపూర్వకంగా లీక్ చేశారు. ఇలా మొత్తం 21 ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి. వీటిని లీక్ చేసిన వారు నేరుగా వీసీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేయడం గమనార్హం. అప్పటికే 2011, నవంబర్ 11న నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య రామకృష్ణారెడ్డి ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా స్వీకరించారు. అప్పటి రిజిస్ట్రార్ రవీంద్ర ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పీఎస్‌లోనూ కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించారు. విచారణ పూర్తి కావడంతో సీఐడీ కోర్టులో చార్జీషీట్ దాఖలైంది. ప్రస్తుతం సీఐడీ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. మొత్తం 14 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 42 మంది సాక్షులను చేర్చారు. కాగా, దూరవిద్య విభాగంలో పనిచేస్తున్న సింహభాగం అధికారులు ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి డైరెక్టర్ ప్రొఫెసర్ పి.సుధాకర్ దివంగతులయ్యారు.
ఎస్కేయూ దూరవిద్య విభాగానికి సంబంధించి 2011లో ప్రశ్నపత్రాల లీకేజీ
సీఐడీ కోర్టులో కేసు విచారణ ప్రారంభం
42 మంది సాక్షులను
విచారించనున్న న్యాయస్థానం
Comments
Please login to add a commentAdd a comment