మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం

Published Wed, Mar 5 2025 12:14 AM | Last Updated on Wed, Mar 5 2025 12:11 AM

మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం

మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం

అనంతపురం అర్బన్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ తేదీన జేఎన్‌టీయూ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాల న్నారు. కార్యక్రమ నిర్వహణకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను నోడల్‌ అధికారిగా నియమిస్తున్నామన్నారు. అదే రోజు 2కే మారథాన్‌ నిర్వహించాలన్నారు. స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, మహిళలకు హెల్త్‌ చెకప్‌, వైద్య శిబిరాలు, న్యూట్రీషన్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న మహిళలను సన్మానించాలన్నారు. మహిళా అధికారులందరూ తప్పక హాజరు కావాలని సూచించారు.

మహిళలకు రుణాలివ్వాలి..

మహిళా దినోత్సవం సందర్భంగా బ్యాంకర్లతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇవ్వాలన్నారు. పీఎంఈజీపీ, ఎంఎస్‌ఎంఈ రుణాలు, పీఎం విశ్వకర్మ, ముద్ర రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. సమావేశంలో డీఆర్‌ఓ మలోల, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, ఎల్‌డీఎం నర్సింగరావు, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, మెప్పా పీడీ విశ్వజ్యోతి, ఏడీసీసీ బ్యాంక్‌ సీఈఓ సురేఖరాణి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్‌, నోడల్‌ అధికారి ఇషాంత్‌, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి అలెగ్జాండర్‌, తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి ఎద్దడి తలెత్తకూడదు

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. తన క్యాంపు కార్యాలయం నుంచి డీఆర్‌ఓ, ఆర్‌డీఓలు, మునిసిపల్‌ కమిషనర్లు, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక, సానుకూల ప్రజా అవగాహన, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కు, ఫీడర్‌ లెవల్‌ పోలరైజేషన్‌ స్కీమ్‌కు ప్రభుత్వ భూమి కేటాయింపు, ఎంఎస్‌ఎంఈ సర్వే తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ఉచిత వైద్యం అందాలి

‘ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌’ ద్వారా పేదలకు ఉచిత వైద్యం కచ్చితంగా అందించాలని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపానల్‌ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. రోగుల నుంచి డబ్బు వసూలు చేయకూడదన్నారు. డబ్బు వసూలు చేస్తున్నట్లు క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆస్పతికి నోటీసు ఇచ్చి విచారణ కోరాలన్నారు. ఆర్‌టీజీఎస్‌, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా నేరుగా ప్రజలకు ఫోన్‌ చేసి ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉన్నారా.. సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది..వైద్య మిత్రలు, ఆస్పత్రి సిబ్బంది ఎవరైనా డబ్బులు అడిగారా.. మందులు అక్కడే ఇస్తున్నారా.. పరిశుభ్రత ఎలా ఉంది.. తదితర అంశాలపై ప్రభుత్వం ఆరా తీస్తోందని, వీటిలో ఎక్కడైనా తేడా వస్తే ఆ ఫిర్యాదు తమకు వస్తుందని కలెక్టర్‌ చెప్పారు. సమావేశంలో ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ట్రాస్ట్‌ కో–ఆర్డినేటర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, డీసీహెచ్‌ఎస్‌ పాల్‌ రవికుమార్‌, రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మణ్‌ప్రసాద్‌, ఆస్పత్రుల అధిపతులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement