నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు
అనంతపురం: నగరంలో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఓ ముఠా గుట్టును వన్‌టౌన్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రూ.48 వేల విలువైన నకిలీ నోట్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్, కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అనంతపురం అర్బన్ డీఎస్పీ వి. శ్రీనివాస రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం బుడ్డప్పనగర్‌కు చెందిన దూదేకుల ఖాసీం, బోయ పవన్‌కుమార్, పడిగల సుకుమార్, బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని అశోక్ చౌదరి, అనంతపురం సంఘమిత్ర నగర్‌వాసి దేవరకొండ రవీంద్ర స్నేహితులు. దూదేకుల ఖాసీం గతంలో శ్రీ సత్యసాయి బాల వికాస్ స్కూల్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ, నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసేవాడు. దీంతో అతడిని అనంతపురం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి, బెయిల్‌పై విడుదలై వచ్చాడు. అప్పటి నుంచి ఖాసీం ఇంటి వద్దే ఉంటున్నాడు. పెద్దవడుగూరు మండలంలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ సస్పెండ్ అయిన కృష్ణా రెడ్డి ఇతనికి పరిచయమయ్యాడు. ఇద్దరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో, వాటి నుంచి బయటపడడానికి బోయ పవన్, పడిగల సుకుమార్, బొమ్మినేని అశోక్, రవీంద్రతో కలిసి నకిలీ కరెన్సీ తయారీకి పూనుకున్నారు. ఇందుకు కృష్ణా రెడ్డి ల్యాప్‌టాప్ ఇచ్చాడు. ముందుగా దేవరకొండ రవీంద్ర ఇచ్చిన రూ.20 వేలతో నగరంలోని కమలానగర్‌లో ఒక ప్రింటర్, పేపర్ కట్టర్, కలర్ జిరాక్స్ పౌడర్ పేస్ట్, బ్రష్‌లను కొనుగోలు చేశారు. అశోక్ చౌదరి సమకూర్చిన రూ.10 వేలతో బెంగళూరులో పేపర్ కొన్నారు. బుడ్డప్ప నగర్‌లోని సుకుమార్ ఇంట్లో నకిలీ కరెన్సీ తయారు చేశారు. ముందుగా సదరు కరెన్సీని ధర్మవరం నగరానికి చెందిన సత్యనారాయణ అలియాస్ సత్తికి ఇచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం దేవరకొండ రవీంద్ర ద్వారా టీవీ టవర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాలు వద్ద పెద్దపప్పూరు మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన నొస్సాం మురళీమోహన్ రెడ్డి, రాప్తాడు కళాకారుల కాలనీకి చెందిన సాకే రామాంజినేయులు అలియాస్ పొట్టి రామాంజి, అనంతపురం నాయక్ నగర్‌కు చెందిన యలమకూరి రామాంజినేయులు అలియాస్ దుబ్బ రామాంజిలకు దొంగ నోట్లు ఇస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.48 వేల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
8 మంది నిందితుల అరెస్టు
ల్యాప్‌టాప్, ప్రింటర్, రూ. 48 వేల విలువైన నకిలీ నోట్ల స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment