
జోరుగా గ్రామీణ క్రీడా పోటీలు
శింగనమల: ఉగాది పండుగను పురస్కరించుకుని మంగళవారం శింగనమలలోని నల్లమ్మ దేవాలయం వద్ద ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. పోటీల్లో నాగలాపురానికి చెందిన ఫణేంద్ర మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానంలో పామిడి మండలం వంకరాజు కాలువ గ్రామానికి చెందిన నరేష్ నిలిచాడు. విజేతలను అభినందిస్తూ నగదు పురస్కారాలతో ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు.
రైలు నుంచి జారిపడి
యువకుడి దుర్మరణం
అనంతపురం సిటీ: స్థానిక జీఆర్పీ పరిధిలోని గార్లదిన్నె– తాటిచెర్ల మార్గమధ్యంలో రైలు నుంచి జారిపడి ఓ యువకుడు (30) మృతి చెందాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో జీఆర్పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి జేబులో యాదగిరి నుంచి యశ్వంత్‌పూర్ వెళ్లే రైల్వే జనరల్ టికెట్‌ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. మృతుడు ఎరుపు, నీలం గీతలు కలిగిన పసుపు రంగు ఆఫ్ టీ షర్ట్, లైట్ సిమెంట్ రంగున్న షర్ట్, మెరూన్ రెడ్ కలర్ ఉన్న పుల్ అండర్‌వేర్ ధరించాడని, ఎత్తు 5.5 అడుగులు, ఛామన ఛాయ రంగు, ఎడమ చేతికి పి.మహి అని, కుడి చేతిపై ఎంఎస్ అనే ఆంగ్ల అక్షరాలు పచ్చబొట్టు వేయించుకున్నాడని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. లవ్ సింబల్ సహా ఓం అనే సింబల్ పచ్చ రంగు టాటూ కూడా చేతిపై ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు :94406 27662 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.
ఉంతకల్లులో నగదు చోరీ
బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లు గ్రామంలో చోరీ జరిగింది. నిందితుడిని స్థానికులు బంధించారు. వివరాలు.. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు సోమవారం మృతి చెందడంతో రాత్రి మృతదేహం వద్ద భజన చేసేందుకు తలారి వన్నూరుస్వామి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య అనంతమ్మ ఒక్కతే నిద్రిస్తోంది. విషయాన్ని గుర్తించిన అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి బీరువాపై ఉన్న తాళాలు తీసుకుని తలుపులు తెరిచి రూ.50వేలు అపహరించుకెళ్లాడు. కాసేపటి తర్వాత మళ్లీ ఇంట్లోకి చొరబడిన అదే వ్యక్తి బీరువాలో నగదు తీస్తుండగా అనంతమ్మ మేలుకువ కావడంతో గమనించి కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వ్యక్తిని నిర్బంధించారు. చోరీ చేసిన డబ్బు వెనక్కు ఇవ్వాలని గ్రామస్తులు తెలపడంతో ఇంట్లో ఉన్నాయని, ఉదయాన్ని తెచ్చిస్తానంటూ తెలిపాడు. దీంతో ఇద్దరికీ స్థానికులు సరిచెప్పి పంపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు.