
పచ్చిరొట్ట విత్తన ధరల ఖరారు
అనంతపురం అగ్రికల్చర్: పచ్చిరొట్ట (గ్రీన్ మెన్యూర్స్) విత్తన ధరలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌లో రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఏటా రైతులకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. పచ్చిరొట్ట విత్తనాల కింద జీలుగ (ధనించా), జనుము (సన్‌హెంప్), పిల్లిపెసర ద్వారా భూసారం పెంచుకునేందుకు వీలుగా పొలాల్లో చల్లి పూతకు వచ్చిన తర్వాత కలియదున్నితే సేంద్రియ పదార్థం బాగా పెరుగుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. దీంతో ఇటీవల ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు, రాయితీలు ఖరారు చేశారు. జిల్లాకు ఈ ఏడాది 190 క్వింటాళ్ల జీలుగ, రెండు క్వింటాళ్ల జనుము, 15వ క్వింటాళ్ల పిల్లిపెసర... మొత్తం 207 క్వింటాళ్లు కేటాయించారు. రబీలో కూడా జనుము, జీలుగ విత్తనాలు 425 క్వింటాళ్లు కేటాయించారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు కూడా ఖరీఫ్‌లో 138 క్వింటాళ్లు ఇచ్చారు. వీటిని 50 శాతం సబ్సిడీతో రైతులకు ఇవ్వనున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా వీటిని సరఫరా చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు. జీలుగ విత్తనాలు క్వింటా పూర్తి ధర రూ.12,300 కాగా, 50 శాతం రాయితీతో రూ.6,150 చొప్పున రైతులకు అందజేయనున్నారు. అలాగే క్వింటా జనుము విత్తనాల పూర్తి ధర రూ.10,900 కాగా, 50 శాతం రాయితీ పోను రూ.5,450 చెల్లించాలి. పిల్లిపెసర క్వింటా పూర్తి ధర రూ.18 వేలు కాగా, 50 శాతం రాయితీ పోను రూ.9 వేల చొప్పున రైతులకు విక్రయిస్తారు. జీలుగు, జనుము విత్తనాలు 10 కిలోల ప్యాకెట్ల రూపంలో, పిల్లిపెసర 8 కిలోల ప్యాకెట్ కింద ఎకరాలోపు ఒక బ్యాగ్, రెండు ఎకరాలకు రెండు, మూడు ఎకరాలున్న రైతులకు మూడు బ్యాగులు, నాలుగు ఎకరాలున్న వారికి నాలుగు బ్యాగులు, ఐదు ఎకరాలు, అంతకన్నా ఎక్కువ ఉన్న వారికి గరిష్టంగా ఐదు బ్యాగులు పంపిణీ చేయనున్నారు. రైతు ఆసక్తిని బట్టి మూడు రకాల విత్తనాలు వేర్వేరుగానూ, మూడు రకాల విత్తనాలు కలిపి ఒకే బ్యాగ్ రూపంలోనూ ఇవ్వనున్నారు. మూడు కలిపిన వాటిలో నాలుగు కిలోల చొప్పున జీలుగ, జనుము, రెండు కిలోల పిల్లిపెసర ఉంటాయి. 10 కిలోలు కలిగిన మిక్సింగ్‌కిట్ పూర్తి ఖరీదు రూ.1,296 కాగా, 50 శాతం రాయితీ పోను రూ.648 చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన రైతులు ఆర్‌ఎస్‌కేలలో తమ వాటా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి.
జిల్లాకు 207 క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాకు 138 క్వింటాళ్ల కేటాయింపు
50 శాతం రాయితీతో రైతులకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనం