
పిడుగుపాటుకు వివాహిత మృతి
గుంతకల్లు రూరల్: పిడుగుపాటుకు ఓ వివాహిత మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం కదిరిపల్లికి చెందిన సుంకన్న, రమాదేవి దంపతుల కుమారుడు రమణకు రెండేళ్ల క్రితం పెద్దపప్పూరు మండలానికి చెందిన ఇంద్రజ (24)తో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో బోరు బావి కింద సాగు చేసిన వేరుశనగ పంట చేతికి వచ్చింది. శుక్రవారం పంటను తొలగించాలనుకున్న దంపతులు గురువారం సాయంత్రం పొలానికి వెళ్లి స్ప్రింక్లర్ల సాయంతో నీళ్లు పెడుతుండగా జడి వాన మొదలైంది. కాసేపటికి ఉరుములు, మెరుపులు ఎక్కువ కావడంతో పని ఆపి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రమణ బోరు బావి వద్దకెళ్లి కాలికి అంటుకున్న బురదను కడుక్కుంటుండగా, నాలుగు అడుగుల దూరంలోనే భర్త కోసం వేచి చూస్తున్న ఇంద్రజపై పిడుగు రాలింది. ఆమె శరీరంలో నుంచి నేరుగా దూసుకెళ్లి భూమిని తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గుండె కింద భాగంలో బొక్క పడి శరీరంలో రెండు చీలికలు ఏర్పడ్డాయి. కాలి పట్టీలు తెగిపడ్డాయి. శరీరం మొత్తం నల్లగా మాడిపోయింది. విషయాన్ని గమనించిన భర్త ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. దాదాపు అరగంట తర్వాత తేరుకున్న ఆయన వెళ్లి విగతజీవిగా ఉన్న పడి ఉన్న భార్యను చూసి బోరున విలపించాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఇంద్రజ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమాదేవి... గ్రామానికి చేరుకుని ఇంద్రజ మృతదేహాన్ని పరిశీలించి, నివేదిక సిద్ధం చేశారు.