
డాక్టర్ మధు మృతిపై అనుమానాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నగరంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న దంతవైద్యులు అమిలినేని మధు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబసభ్యుల వాంగ్మూలం మేరకు మేడపై నుంచి కాలుజారి పడి మృతి చెందినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన మృతి కాదని, ఆత్మహత్య చేసుకున్నారని స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏరోజూ పై అంతస్తుకు వెళ్లి నీళ్ల ట్యాంకును పరిశీలించలేదని, ఇప్పుడెందుకు చేసి ఉంటారని చెబుతున్నారు. పైగా భార్య, తల్లిదండ్రులు, సోదరులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లే ఫైనల్‌గా మూడో పట్టణ సీఐ కేసు నమోదు చేశారు. కానీ తల్లిదండ్రులు వేరే కాలనీలో ఉంటున్నారు, మధు కుటుంబం రెవెన్యూ కాలనీలో ఉంటుంది, తమ్ముడు కోర్టు రోడ్డులో ఉంటున్నారు.. వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వీళ్లు కాలుజారి పడినట్టు చెప్పడం అనుమానాలకు తావిస్తోందని మధుకు బాగా కావాల్సిన వారు చెబుతున్నారు. ఒక ఉన్నతాధికారి జోక్యం మేరకు పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే తతంగం పూర్తి చేశారని తెలుస్తోంది.
చెడ్డపేరు రాకుండా చూడండి!
మధు, ఆయన భార్య సుష్మ ఇద్దరూ దంతవైద్యులు. టవర్‌క్లాక్ సమీపంలో రూప డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. చనిపోవడానికి రెండు, మూడు గంటల ముందు క్లినిక్ నుంచి ఇంటికెళ్లే సమయంలో.. ‘నేను ఇక రాను, నాకు చెడ్డపేరు తెచ్చేలా క్లినిక్‌ను నిర్వహించొద్దు’ అని అన్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది ఎవరికీ చెప్పకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. గత కొన్ని నెలలుగా మధు.. మానసికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ఆయన మిత్రులు చెబుతున్నారు. కాగా, త్రీటౌన్ అంటే తిమ్మిని బమ్మిని చేసే స్టేషన్ అని ఇప్పటికే విమర్శలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాళ్లు చెప్పినట్టే కేసు నమోదు: సీఐ
భార్య, తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్‌మెంటు ప్రకారమే కేసు నమోదు చేశామని త్రీటౌన్ సీఐ శాంతిలాల్ తెలిపారు. మృతిపై అనుమానముందని ఎవరో ఒకరు చెప్పాలని, అయితే ఎవరూ చెప్పలేదన్నారు. అయినా తమ వైపు నుంచి విచారణ చేస్తామని, ఇందుకు సమయం పడుతుందన్నారు. జారిపడిన దానికి, ఆత్మహత్య చేసుకున్న దానికి తేడాపై ప్రశ్నించగా.. ‘చనిపోయినది నిన్ననే కదా. విచారణకు సమయం పడు తుంది. అప్పుడు తేలుతుంది’ అని పేర్కొన్నారు.
ఆత్మహత్య చేసుకున్నట్టు స్నేహితుల అనుమానం
కాలుజారి పడి మృతి చెందినట్టు పోలీసుల రికార్డుల్లో..
అనుమానాస్పదమని ఎవరూ చెప్పలేదంటున్న సీఐ