గుమ్మఘట్ట: మండలంలోని నేత్రపల్లి గ్రామ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (బీపీఎం)గా పని చేస్తున్న సి.కె.జనార్దనరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు గుంతకల్లు పోస్టల్ అసి స్టెంట్ సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్ ఆదివారం వెల్లడించారు. కాగా, గ్రామంలోని తపాలశాఖ పరిధిలో రికరింగ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాల్లో పలు అవకతవకలకు పాల్పడినట్లుగా జనార్దనరావుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును వారి ఖాతాల్లోకి జమ చేయని అంశంపై ఇటీవల రాయదుర్గం మండలం 74ఉడేగోళం సబ్ పోస్టుమాస్టార్ నాగాబింక ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమికంగా చేపట్టిన విచారణలో అక్రమాలు బహిర్గతం కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జనార్దనరావు అక్రమాలపై లోతైన విచారణకు పోస్టల్ ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు సమాచారం.
చేతిలోని మొబైల్ లాక్కెళ్లిన దొంగ
రాప్తాడు రూరల్: చేతిలో మొబైల్ పట్టుకుని చూస్తుండగా ఓ యువకుడు లాక్కొని ఉడాయించిన ఘటన ఆదివారం సాయంత్రం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాలు... అనంతపురం రూరల్ మండలం కొడిమి పంచాయతీ దర్గాకొట్టాలుకు చెందిన జాఫర్ పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనిపై ఆదివారం నగరానికి వచ్చిన ఆయన సాయంత్రం బళ్లారి రోడ్డు కూడలిలో ఆటో కోసం వేచి ఉన్నాడు.
అదే సమయంలో ఫోన్ రింగ్ కావడంతో జేబులో నుంచి తీసి చూస్తుండగా రెప్పపాటులో ఓ యువకుడు లాక్కొని కళ్యాణదుర్గం రోడ్డు వైపుగా పరుగుతీశాడు. జాఫర్ తేరుకుని గట్టిగా కేకలు వేసినా లాభం లేకపోయింది. చీకట్లు ముసురుకుంటుండడంతో సెకన్లలోనే ఆ యువకుడు కనిపించకుండా పోయాడు. ఇటీవలే రూ. 20 వేలు పెట్టి మొబైల్ కొనుగోలు చేశానని, ఇంతలో ఇలా జరిగిందంటూ బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హోరాహోరీగా రాతిదూలం పోటీలు
పుట్లూరు: శ్రీరామనవమి సందర్భంగా పుట్లూరు మండలం రంగమనాయునిపల్లిలో ఆదివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉదయం ఆలయంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రాతిదూలం లాగుడు పోటీలను నిర్వహించారు. పోటీలను చూసేందుకు పుట్లూరు, యల్లనూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
బ్రహ్మసముద్రం : మండల వ్యాప్తంగా గ్రామాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వేపులపర్తి గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. అయితే మండల వ్యాప్తంగా టీడీపీ నాయకులు 30 గ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో మద్యం సరఫరా చేస్తూ.. 50కి పైగా బెల్టు షాప్‌లు నడుపుతున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. మండల కేంద్రంలో అయితే ఏకంగా పాత తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోనే మద్యం విక్రయాలు చేపట్టి, అక్కడే తాగేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణం ఓ బార్‌లా మారింది.
ఎటుచూసిన తాగి పడేసిన మద్యం బాటిళ్లే కనిపిస్తున్నాయి. అదే తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్యూరిఫైడ్ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చి నీటిని తీసుకెళ్లేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామమాత్రంగా గ్రామాల్లో తనిఖీలు చేపట్టి చేతులు తడుపుకునే అధికారులు.. పాత తహసీల్దార్ కార్యాలయం వైపుగా కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.

హోరాహోరీగా రాతిదూలం పోటీలు

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు