
మద్దతు ధర చట్టం అమలుకు మరో ఉద్యమం
అనంతపురం సిటీ: మద్దతు ధర చట్టం అమలకు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని రైతులకు రైతు సంఘం రాష్ట్ర క్యాదర్శి కేవీవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. వ్యవసాయ పథకాలకు 90 శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడులోని నాగపట్నంలో అఖిల భారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో అనంతపురంలోని డీపీఆర్‌సీ భవన్‌లో ఉద్యాన రైతుల రాష్ట్ర సదస్సు మంగళవారం నిర్వహించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చిరుతల మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కేవీవీ ప్రసాద్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీస్, జిల్లా కార్యదర్శి జాఫర్, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య, రాష్ట్ర రైతు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కాటమయ్య, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అనంత రాముడు హాజరయ్యారు. కేవీవీ ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. దేశ వ్యాప్తంగా 600 రకాల పండ్లను రైతులు ఉత్పత్తి చేస్తున్నా.. కేవలం 24 రకాల పండ్ల ఉత్పత్తులకు మాత్రమే కేంద్రంలోని కూటమి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం బాధాకరమన్నారు. రెతులు పండించిన పంట ఉత్పత్తులపై శ్రమ, ఖర్చులతో పాటు 50 శాతం అదనంగా కలిపి ధర నిర్ణయిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుందన్నారు. అప్పుడే రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడుకోగలమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అనంతపురం జిల్లా ఫ్రూట్ బోల్‌గా ఎదగాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. అప్పటి వరకూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ.. ఎకరాకు రూ.30 వేలు ఇస్తూ 30 ఏళ్లకు రైతుల నుంచి భూములు అగ్రిమెంట్ చేసుకున్న గాలిమరల నిర్వాహకులు ఆ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం దారుణమన్నారు. కాటమయ్య మాట్లాడుతూ.. కార్పొరేట్ అప్పులను రద్దు చేస్తున్న తరహాలోనే రైతుల అప్పులనూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యు డు లింగమయ్య, ఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేశ్, నిర్మల, ఇంకా వివిధ స్థాయిల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి
కేవీవీ ప్రసాద్

మద్దతు ధర చట్టం అమలుకు మరో ఉద్యమం