
రైల్వే సమస్యలను పరిష్కరించాలి
గుంతకల్లు: రైల్వేలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేయూతనివ్వాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో 66వ డివిజినల్ యూజర్స్ కన్సలేటివ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్త అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతోపాటు డివిజన్ పరిధిలోని డీఆర్‌యూసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో రైల్వే పరమైన అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య 65 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ మార్గం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. తద్వారా కడపలోని పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులకు, రైతులు పండించిన పంటలు ఇతర ప్రాంతాలకు తరలించడానికి రవాణామార్గం ఎంతగానో ఉపయోగపడుతుందన్నా రు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ నిరంతరాయంగా రిజర్వేషన్ కౌంటర్లు ఉండేలా చూడాలన్నారు. కరోనా సమయంలో రద్దయిన విజయవాడ–బెంగుళూరు, తిరుపతి–హుబ్లీ ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించాలని కోరారు. అలాగే కరోనా కారణంగా స్టాపింగ్‌లు నిలిపి వేసిన స్టేషన్లను తిరిగి పునరుద్దరించాలన్నారు. ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి అవరోధంగా మారిన ధర్మవరం రైల్వే ఎల్‌సీ గేట్ స్థానంలో ఆర్‌యూబీ నిర్మాణ పనులు చేపట్టాలని, కసాపురం రైల్వే మోరీ విస్తీరణ పనులు చేపట్టాలని సూచించారు. సమస్యలను రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్త అన్నారు. సమావేశంలో సీనియర్ డీసీఎం మనోజ్, డీఆర్‌యూసీసీ సభ్యులు పాల్గొన్నారు.
డీఆర్‌యూసీసీ సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల విజ్ఞప్తి