
13న యూపీఎస్‌సీ ఫ్లాగ్‌షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్: ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఈనెల 13న ఫ్లాగ్‌షిప్ పరీక్ష జరగనుంది. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 363 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. యూపీఎస్‌సీ నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరుగుతాయన్నారు. అధికారులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి ఇన్‌స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ.రామ్మోహన్, రూట్ ఆఫీసర్‌గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, కేఎస్‌ఎస్ డిగ్రీ, పీజీ కళాశాల పరీక్ష కేంద్రా నికి ఇన్‌స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, రూట్ అధికారిగా వి.మల్లికార్జునరెడ్డిని నియమించామన్నారు. కేంద్రం వద్ద ఒక ఎస్‌ఐ, ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించే సమయంలో నలుగురు ఆర్మ్‌డ్ పోలీసులను ఎస్కార్ట్‌గా నియమించాలని చెప్పారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష వేళలకు అనుకూలంగా బస్సులు నడపాలని ఆదేశించారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పరీక్ష సమయం ఇలా...
● ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేపర్–2, 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–3 పరీక్ష జరుగుతుంది.
● కేఎస్‌ఎన్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల పరీక్ష కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ పరీక్షకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1, 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–2 జరుగుతుంది.
● అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి.
● ఈ–అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు, సెల్ఫ్ ఫొటోలు, పెన్, పెన్సిల్ తీసుకురావాల్సి ఉంటుంది.
● మొబైల్ ఫోన్లు, డిజిటల్, స్మార్ట్ గడియారాలు, బ్లూటూత్ తదితర వస్తువులను అనుమతించరు.
నిషేధిత భూములపై శిక్షణ
అనంతపురం అర్బన్: నిషేధిత భూములు (22ఏ), చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాన్ని ఆధార్‌తో అనుసంధించాలని చెప్పారు.రెవెన్యూ సెక్టార్‌పై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోలతో కలిసి ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ‘అనంత అభ్యాసం’ కింద ఈనెల 11న డివిజన్, మండలస్థాయి రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో తాను, జేసీ పాల్గొంటామని చెప్పారు. పట్టాదారు పాసు పుస్తకాన్ని ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఆర్‌డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీల పరిశీలన చేపట్టాలని, నివేదికలు ఈ–ఆఫీసులో సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, ఆర్‌డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.