
ఈదురుగాలులకు రూ.8.83 కోట్ల పంట నష్టం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వారం రోజులుగా ఈదురుగాలుల తాకిడితో వ్యవసాయ పంటలకు రూ.8.83 కోట్లు మేర నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శెట్టూరు, నార్పల, గార్లదిన్నె, అనంతపురం, శింగనమల, కంబదూరు, కణేకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బొమ్మనహాళ్, బెలుగుప్ప, డీ.హీరేహాళ్ తదితర మండలాల పరిధిలో 51 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశామన్నారు. మొత్తంగా 881 మంది రైతులకు చెందిన 1,136 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో 659 హెక్టార్లలో మొక్కజొన్న నేలవాలడంతో 603 మంది రైతులకు రూ.5.60 కోట్లు మేర నష్టం జరిగిందన్నారు. 239 మంది రైతులకు చెందిన 383 హెక్టార్లలో వరి దెబ్బతినడంతో రూ.275 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. 39 మంది రైతులకు చెందిన 94 హెక్టార్లలో పత్తి దెబ్బతినడంతో రూ.47 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేశామని పేర్కొన్నారు.
కుప్పకూలిన గాలిమర
పుట్లూరు: ఎ.కొండాపురం వద్ద కొండలపై ఏర్పాటు చేసిన గాలిమర కుప్పకూలింది. వివరాలు ఇలా ఉన్నాయి. 1999లో బీహెచ్‌ఈఎల్‌కు చెందిన 16 గాలిమరలను కొండలపై ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులుకు ఒక గాలిమర కుప్పకూలిపోయింది. ఆ సమయంలో సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం వల్ల రూ.50 లక్షల మేర నష్టం చేకూరినట్లు సిబ్బంది చెబుతున్నారు.