
వడగండ్ల వాన.. ఈదురుగాలులు
● దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు
● అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ
● విరిగి పడిన భారీ వృక్షాలు
● నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
యర్రగుంట గ్రామం వద్ద నేలకొరిగిన వరి పంట
రాయదుర్గం/కణేకల్లు/ బొమ్మనహాళ్/ బెళుగుప్ప/ కూడేరు/ బ్రహ్మసముద్రం/ శింగనమల: జిల్లా వ్యాప్తంగా గాలీవాన బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం, శుక్రవారం వడగండ్ల వాన, ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు రాలిపోయాయి. కణేకల్లు మండలంలోని యర్రగుంట, గెనిగెర, కణేకల్లు, గంగలాపురం, బ్రహ్మసముద్రం గ్రామాల్లో గురువారం రాత్రి వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. వడగండ్లు, ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు సుమారు రూ.13.97 కోట్ల మేర నష్టం వాటిల్లింది. యర్రగుంటలో తెల్లారితే వరికోత చేసేందుకు సిద్ధం కాగా... రాత్రికి రాత్రే వడగండ్ల వాన కురిసి పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని రైతులు జగన్నాథం, లింగారెడ్డి, వాల్మీకి వండ్రప్ప, కురుబ తిప్పేస్వామి, కె.ఎర్రిస్వామి, కురుబ ఆదెప్ప, బోయ వండ్రప్ప ఆందోళన వ్యక్తం చేశారు. గోపులాపురంలో బసవరాజుకు చెందిన 6 ఎకరాల్లో అరటితోట, బి.నవీన్ 8, రామక్రిష్ణకు చెందిన 6 ఎకరాల్లో అరటితోట దెబ్బతింది. బొమ్మనహాళ్ మండలం శ్రీధరఘట్ట, గోనేహాళ్, లింగదహాళ్, ఉద్దేహాళ్, ఉప్పరహాళ్, దేవగిరి, ఉంతకల్లు, బండూరు, లింగదహాళ్ తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కోత దశకు వచ్చిన వరితో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, అక్కడక్కడ చెట్లు కూడా నేలకొరిగాయి. రాయదుర్గం మండలంలోనూ పంటలు దెబ్బతిన్నాయి. బెళుగుప్ప మండలంలోని బెళుగుప్ప, బెళుగుప్ప తండా, నక్కలపల్లి, గుండ్లపల్లి, రమనేపల్లి, బ్రాహ్మణపల్లి, యలగలవంక, శీర్పి, గంగవరం, దుద్దేకుంట, అంకంపల్లి, ఆవులెన్న, రామసాగరం, రమనేపల్లి తదితర గ్రామాల్లో 650 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 50 ఎకరాల్లో అరటి తదితర పంటలు ఈదురుగాలులకు నేలవాలాయి. ఇంకా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు పడిపోయాయి. ఇదిలా ఉండగా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టం అంచనా వేశారు. బొమ్మనహాళ్ మండలం గోనేహాళ్ వద్ద దెబ్బతిన్న వరి పంట పొలాలను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ, నాగిరెడ్డిపల్లి, గుండిగానిపల్లి, ఎర్రకొండాపురం తదితర గ్రామాల్లో బొప్పాయి, అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. కూడేరు మండలం కడదరగుంట, పి.నారాయణపురం, ఎంఎం హళ్లి, మరుట్ల–1, 2, 3 కాలనీలు, చోళసముద్రం, ముద్దలాపురం, మరికొన్ని గ్రామాల్లో పెనుగాలులకు అరటి, మొక్కజొన్న, బ్యాడిగి మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నాయి. శింగనమల మండలంలో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. తరిమెలలో శుక్రవారం సాయంత్రం గాలీవానకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లపై అడ్డంగా పడిపోయాయి.