
బాల కార్మికులకు పునరావాసం కల్పించాలి
అనంతపురం సిటీ: జిల్లాలో బాల కార్మికులకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి, వారికి పునరావాసం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశంపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మతో కలసి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి బాల కార్మికుని ప్రొఫైల్, ట్రాక్ రికార్డు మెయింటెన్ చేయాలన్నారు. ప్రాసిక్యూషన్, మినిమం వేజెస్, బాల కార్మికులకు అందజేసిన సహాయక చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలన్నారు. ప్రతి బాల కార్మికుడిని పునరావాసం కల్పించి, తిరిగి పని ప్రదేశానికి వెళ్లకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన అసంఘటిత రంగ కార్మికులందరి వివరాలు నమోదు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, మున్సిపల్, ప్లాన్ అప్రూవల్ అథారిటీలందరూ ప్రతి నిర్మాణంపై మొత్తం వ్యయంలో ఒక శాతం సెస్‌ను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు జమ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ లలిత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీ దేవి, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, కార్మిక శాఖ అధికారులు లక్ష్మీ,నర్సయ్య, రాధా రమాదేవి, సుజాత, ప్రతాప్ నాయుడు, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, డీఈఓ ప్రసాద్, చేనేత శాఖ ఏడీ శ్రీనివాసరెడ్డి, డ్వామా, డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.