
తీర్థయాత్రలో విషాదం
పుంగనూరు: నూతనంగా కొనుగోలు చేసిన కారులో తీర్థయాత్రకు వెళ్లి వస్తున్న ఉపాధ్యాయ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా... విషమ పరిస్థితుల్లో భర్త, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు... అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఎర్రయ్యగారిపల్లికి చెందిన వెంకటరమణ, శారద (45) దంపతులకు కుమార్తె కీర్తన, కుమారుడు శ్రీకర్ ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నివాసముంటూ అదే మండలం బాలప్పగారిపల్లిలో ఉపాధ్యాయురాలిగా శారద, అన్నమయ్య జిల్లా సోంపల్లిలో స్కూల్ అసిస్టెంట్‌గా వెంకట రమణ పనిచేస్తున్నారు. కీర్తన ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. శ్రీకర్ గుడివాడలోని ఓ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఉపాధ్యాయ దంపతులు నూతనంగా ఓ కారును కొనుగోలు చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలైకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ లోపు శనివారం ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. కుమార్తె కీర్తన అత్యధిక మార్కలతో ఉత్తీర్ణత సాధించడంతో ఎంతో సంతోషపడిన ఉపాధ్యాయ దంపతులు తిరువణ్ణామలైకు వెళ్లి పూజదికాలు ముగించుకుని ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో పుంగనూరు మండలం సుగాలీమిట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. శారద అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ, కుమారై కీర్తనను స్థానికులు గమనించి మదనపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, శారద అంత్యక్రియలను వెంకటరమణ స్వగ్రామం కలకడలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
మహిళా ఉపాధ్యాయురాలు మృతి
భర్త, కుమార్తె పరిస్థితి విషమం

తీర్థయాత్రలో విషాదం

తీర్థయాత్రలో విషాదం

తీర్థయాత్రలో విషాదం