
విద్యా విధానంలో.. గందరగోళ నిర్ణయాలు తగదు
● రాష్ట్రోపాధ్యాయ సంఘం
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని విద్యా విధానంలో రోజురోజుకూ గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలాంటి నిర్ణయాలు సముచితం కాదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు మండిపడ్డారు. ఆదివారం విజయవాడ వేదికగా జరిగిన ఎస్టీయూ రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు కాబోతున్న విద్యా విధానంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగేలా అధికారిక నిర్ణయాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 117 జీఓను రద్దు చేస్తామని, ప్రతి పంచాయతీకి ఓ మోడల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. మరోసారి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా ప్రతి పంచాయతీకి మోడల్ పాఠశాల ఏర్పాటు చేయలేమని, ఆ గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం చాలా దుర్మార్గమన్నారు. ఈ విధానాలతో ఉపాధ్యాయుల మీద ఒత్తిళ్లు పెరిగిపోతాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పునరాలోచించి జీఓ 117ను రద్దు చేసి విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉంచి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రామాంజనేయులు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి జి. సూర్యుడు, రాష్ట్ర కార్యదర్శి కె. చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రైతు ఆత్మహత్య
పెద్దవడుగూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు (49)కు భార్య రమాదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమకున్న ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో పంట పెట్టుబడులు, కుమార్తెల పెళ్లిళ్లు, అనారోగ్యంతో బాధపడుతున్న భార్య చికిత్సకు తెలిసిన వారి వద్ద రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. గ్రామంలో వ్యవసాయ పనులు సక్రమంగా లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన ఆయన శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. అపస్మారకంగా పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.