
48 ఏళ్ల తర్వాత...
● అ‘పూర్వ’ సమ్మేళనం
పెద్దవడుగూరు: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో 1992లో పదో తరగతి చదివిన వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సరస్వతీ దేవి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ పంక్షన్ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాలకు చేరుకుని తమతో పాటు చదువుకుని అకాల మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. రూ.40 వేలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పూర్వ విద్యాఉ్థలు అనిల్, రాజేశ్వరమ్మ ముందుకు వచ్చారు.
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని శ్రీపొట్టి శ్రీరాములు నగర పాలకోన్నత పాఠశాలలో 1976–1977లో 10వ తరగతి చదివిన వారు ఆదివారం అదే పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ జీవితంలో స్థిరపడిన వారు 48 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చాలామంది విద్య, వైద్యం, న్యాయ శాఖ, రెవెన్యూ, ఆడిట్, అటవీ శాఖ, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర రంగాల్లో సేవలందించి ఉద్యోగ విరమణ సైతం పొందారు. తమ చిన్ననాటి అల్లర్లను, గురువులతో వారికున్న సత్సంబంధాలను గుర్తు చేసుకున్నారు. గురువులు సూర్యనారాయణ శాస్త్రి, రంగప్ప, కృష్ణమూర్తి, గంగాచారిని ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి శ్యామసుందర్, అటవీ శాఖ అధికారి ఆంజనేయులు, వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షకులు మనోహర్, పోస్టల్ శాఖ వన్నప్ప, ఆడిటర్ హరినాథ్, విశ్రాంత తహసీల్దార్ సిరాజుద్దీన్, విద్యా శాఖ షేక్ మహబూబ్‌బాషా, రియాజుద్దీన్, రక్షణ శాఖ లక్ష్మీకాంత రెడ్డి, వ్యాపారవేత్త అబ్దుల్ ఖయూమ్‌తో పాటు మరో 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గురువులు పుల్లన్న, పద్మనాభ శాస్త్రి, చిన్నకేశవులు ఇళ్ల వద్దకు వెళ్లి ఘనంగా సత్కరించారు.

48 ఏళ్ల తర్వాత...