
టీడీపీ నేతపై హత్యాయత్నం
బొమ్మనహాళ్: మహిళ పరువు తీశాడన్న కక్షతో టీడీపీ నేతపై బాధితురాలి సంబంధీకులు కత్తితో దాడి చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం కల్లుహోళ గ్రామానికి చెందిన టీడీపీ నేత సోమన్నగౌడ్... అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో గుట్టుగా వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం వెలుగు చూడడంతో కొన్నేళ్ల క్రితం పెద్ద మనుషుల పంచాయితీ నిర్వహించి ఇద్దరినీ మందలించారు. ఇటీవల సోమన్నగౌడ్ మళ్లీ ఆమెతో మాట్లాడుతుండడం సదరు మహిళ మేనల్లుడు గోవిందు గమనించాడు. దీంతో గ్రామంలో తమ మేనత్త పరువు తీయడమే కాక మళ్లీ ఆమెతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తుండడాన్ని జీర్ణించుకోలేక అదే గ్రామానికి చెందిన బి.వన్నప్పతో కలసి ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత తన ఇంటి ఎదుట నిద్రిస్తున్న సోమన్నగౌడ్‌పై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో సోమన్నగౌడ్ దాడిని ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు మేల్కొనడంతో గోవిందు, వన్నప్ప అక్కడి నుంచి పారిపోయారు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు.
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అపశ్రుతి
ఉరవకొండ: పట్టణంలో సోమవారం నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో దళిత సంఘం నాయకుడు, పెద్ద ముష్టూరు గ్రామానికి చెందిన నాగరాజు (49) గుండెపోటుతో మృతి చెందాడు. ముందుగా ర్యాలీలో పాల్గొన్న ఆయన అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తుండగా ఒక్క సారిగా ఛాతి పట్టుకుని కుప్పకూలాడు. గమనించిన నాయకులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్దారించారు. నాగరాజు మృతిపై దళిత సంఘం నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు సంతాపం తెలిపారు.
పెనుగాలుల బీభత్సం
గార్లదిన్నె: మండల కేంద్రం గార్లదిన్నెతో పాటు కల్లూరులో సోమవారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. కల్లూరులో 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ కూలి రోడ్డు మీద పడింది. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అలాగే గార్లదిన్నెలోని డ్యాం రోడ్డు రైల్వే గేట్ వద్ద పురాతన వేపవృక్షం విరిగి పడింది. గ్రామాల్లోని పలు తోటల్లో చెట్లు విరిగి పడినట్లు రైతులు తెలిపారు.
పామిడిలో గాలీవాన
పామిడి: మండల కేంద్రం పామిడిలో సోమవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో ఇళ్ల రేకులు, పీఓపీ సీట్లు ఎగిసి పడ్డాయి. రేకుల షెడ్లు నేల కొరిగాయి.

టీడీపీ నేతపై హత్యాయత్నం

టీడీపీ నేతపై హత్యాయత్నం