
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
అనంతపురం కార్పొరేషన్: ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తూ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ వసీం ధ్వజమెత్తారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కక్ష సాధింపులు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారన్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి వైఎస్ జగన్ పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. రూ.2.75 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా పేదరికం నిర్మూలనకు కృషి చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ మాట్లాడుతూ.. పారదర్శకత, అవినీతిరహిత పాలనను జగనన్న అందిస్తే.. ఇందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కూటమి సర్కార్ పాలన సాగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం అనంతరం జెడ్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, అనుబంధ విభాగాల రాష్ట్ర నాయకులు కాగజ్‌ఘర్ రిజ్వాన్, పెన్నోబులేసు, కృష్ణవేణి, వేముల నదీం, అనుబంధ సంఘాల అధ్యక్షులు మల్లెమీద నరసింహులు, వైపీ బాబు, శ్రీదేవి, సైఫుల్లాబేగ్, అమర్‌నాథ్ రెడ్డి, చంద్రలేఖ, నాయకులు ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి, మీసాల రంగన్న, పసులూరు ఓబులేసు, దాదు, తలారి వెంకటేష్, మారుతీనాయుడు, తనీష, మాల్యవంతం మంజుల, ఫయాజ్, సతీష్, లక్ష్మణ్, శోభారాణి , శోభాబాయి, కార్పొరేటర్లు కమల్‌భూషణ్, దుర్గాదేవి, రహంతుల్లా, రాజేశ్వరి పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయాలను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం
వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి