
మట్టి తోలితే.. మనల్నెవడ్రా ఆపేది..?!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘మేమేం చేసినా మమ్మల్ని అడిగేవారు లేరు.. ఆపేవారు అంతకన్నా లేరు.. అంతా మా ఇష్టం’ అన్న తరహాలో ఆత్మకూరు మండలంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడికై నా మట్టి తోలాలంటే ముందుగా రెవెన్యూ అధికారులు, మైనింగ్ శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటి నిబంధనలేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మట్టిని అక్రమంగా తరలిస్తూ ఓ తెలుగు తమ్ముడు జేబులు నింపుకుంటున్నాడు. ఆత్మకూరు మండలం వడ్డుపల్లి సమీపంలో టీడీపీ నాయకుడు కృష్ణమోహన్ నెల రోజుల నుంచి మట్టిని కొల్లగొడుతున్నాడు. ఇప్పటివరకూ దాదాపు 500 టిప్పర్ల వరకు అక్రమంగా మట్టి తరలించినట్లు తెలి సింది. ఒక టిప్పర్ రూ.7 వేల వరకు విక్రయిస్తూ రూ. లక్షలు వెనకేసుకుంటున్నాడు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామంలో శ్రీ కృష్ణుని గుడి నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి భూమి పూజ చేయగా.. అప్పట్లో సదరు కృష్ణమోహన్ వేరే వారితో ఫోన్‌లో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వస్తే గుడి కట్టినా, బడి కట్టినా కూల్చేస్తాం అన్న మాటలు పెద్ద దుమారమే లేపాయి.
చోద్యం చూస్తున్న అధికారులు..
నిత్యం వందల మట్టి టిప్పర్లు అనుమతి లేకుండా హైవేపైనే వెళ్తున్నా.. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండల రెవెన్యూ అధికారు లకు విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వడ్డుపల్లి సమీపంలో టిప్పరుతో అక్రమంగా మట్టి తరలిస్తున్న దృశ్యం