
మందకొడిగా రైతు రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ చేపట్టిన రైతు రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మందకొడిగా కొనసాగుతోంది. ఆధార్‌కార్డు మాదిరిగా ప్రతి రైతుకూ 11 నంబర్లతో కూడిన ప్రత్యేక విశిష్ట సంఖ్య (ఫార్మర్ రిజిష్ట్రీ ఐడీ) కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే, ఇందులో భాగంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్‌ఆర్) అగ్రీ స్టాక్ యాప్ నెల రోజులుగా సక్రమంగా పని చేయడం లేదని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలంటూ వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో ఆర్‌ఎస్‌కే సిబ్బంది సతమతమవుతున్నారు. రైతు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, వాటికి అనుసంధానం అయిన మొబైల్ నెంబరు ద్వారా రిజిస్టరేషన్ చేసిన తర్వాత రైతుకు 11 నంబర్లతో కూడిన ఐడీ నంబరు కేటాయిస్తున్నారు. ఇందుకు మూడు సార్లు ఓటీపీ సక్సెస్ కావాల్సివుంటుంది. చాలా వరకు రెండు ఓటీపీలు సక్సెస్ అవుతున్నా మూడోసారి ఓటీపీ కావడం లేదని తెలిసింది. దీంతో అంతరాయం ఏర్పడుతోందని సిబ్బంది వాపోతున్నారు. భవిష్యత్తులో ఇన్‌పుట్‌సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, పావలావడ్డీ, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యాంత్రీకరణ, రాయితీ విత్తనాలు, పంట ఉత్పత్తుల అమ్మకాలు తదితర వ్యవసాయ అనుబంధ శాఖల పరిధిలో ప్రభుత్వ ఫలాలు వర్తించాలంటే రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు.
రెండు నెలల్లో 60 శాతమే..
జిల్లా వ్యాప్తంగా 3,42,666 మందికి విశిష్ట సంఖ్య కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1.97 లక్షల మందికి కేటాయించారు. అంటే గత రెండు నెలలుగా చేస్తున్నా 60 శాతం పూర్తీ చేశారు. ఇంకా 40 శాతం పెండింగ్ ఉండటంతో ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఆ లోపు కూడా ప్రక్రియ పూర్తి కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇప్పటివరకూ పెద్దవడుగూరు మండలంలో 94 శాతం పూర్తి కావడంతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. పెద్దపప్పూరులో 90 శాతం, గుత్తి 88, రాయదుర్గం 83, యాడికి 83, తాడిపత్రి 79, గుంతకల్లు 78 శాతం ఇలా కొన్ని మండలాల్లో రిజిస్ట్రేషన్లు బాగానే జరిగాయి. అయితే గుమ్మఘట్ట 33 శాతం, కుందుర్పి 36, వజ్రకరూరు 37, బుక్కరాయసముద్రం 38, బెళుగుప్ప 39, కళ్యాణదుర్గం 40 శాతం... ఇలా కొన్ని మండలాల్లో మందకొడిగా కొనసాగుతోంది.
యాప్ సరిగా పనిచేయక
సిబ్బంది సతమతం
ఇప్పటి వరకు 60 శాతం పూర్తయినట్లు వెల్లడి