
హంద్రీ–నీవాకు లైనింగ్ వద్దు
అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టి రైతుల బతుకులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఏఐకేకేఎంఎస్ (అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గిరీష్, నాగముత్యాలు మండిపడ్డారు. లైనింగ్ కారణంగా భూగర్భజలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే లైనింగ్ పనులు ఆపి, కాలువ వెడల్పు పనులు చేపట్టాలని, హంద్రీ–నీవాకు 40 టీఎంసీల నీటిని కేటాయించాలనే డిమాండ్లతో సంఘం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ చేపట్టడమంటే రైతులకు భవిష్యత్తు లేకుండా చేయడమేనని మండిపడ్డారు. హంద్రీ–నీవా కాలువ పరిసరాల్లోని వై.కొత్తపల్లి, పంపనూరు, పంపనూరు తండా, వేపచెర్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు పంటలు పండించుకోగలుగుతున్నారని తెలిపారు. ఫేజ్–2లో భాగంగా హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేపట్టడం ద్వారా భూగర్భజలాలు అడుగంటి పండ్ల తోటలు, ఇతర పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రనష్టపోతారన్నారు. అలాగే గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుందన్నారు. రైతులు వ్యవసాయం వదులుకుని ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని లైనింగ్ పనులు ఆపి, 8వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాంతో కాలువను వెడల్పు చేయాలని, ఏటా 40 టీఎంసీల నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినోద్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, నాయకులు వెంకటేష్ నాయక్, రమేష్, రామకృష్ణ, ఎర్రిస్వామి, రైతులు పాల్గొన్నారు.
ఏఐకేకేఎంఎస్ నాయకుల డిమాండ్
పనులు ఆపి, కాలువ వెడల్పు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా