
పీ4 పేరుతో చంద్రబాబు వంచన
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో పీ4 అమలుతో పేదరికం పోగొడతానంటూ ప్రజలను సీఎం చంద్రబాబు వంచనకు గురి చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మోదీ, చంద్రబాబు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పేదలు, ధనవంతుల మధ్య తారతమ్యం పెరుగుతోందన్నారు. దేశ, రాష్ట్ర సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ పేదరికం పెంచుతున్నట్లుగా గొప్పలకు పోతున్నారని విమర్శించారు. వక్ఫ్ చట్టం సవరణ పేరుతో రాజ్యాంగం, లౌకికవాదంపై కేంద్రంలోని కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. ఇది ఇక్కడితో ఆగదని, ముస్లింల తర్వాత చర్చిల భూములు, అటు తర్వాత హిందు ఆలయాల భూములపై కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
దెబ్బతిన్న పంటలపై
శ్రద్ధ చూపని ప్రభుత్వం
కూడేరు: ప్రకృతి వైపరీత్యాలతో అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో దెబ్బతిన్న తోటలు, ఇతర పంటలపై నష్టం అంచనా వేయించి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రామకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన కూడేరు మండలం ముద్దలాపురం, కడదరకుంట, చోళసముద్రం గ్రామాల్లో పర్యటించి, మూడు రోజుల క్రితం పెను గాలులు, వర్షానికి దెబ్బతిన్న అరటి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.35 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తోందని, అయితే ఈ సాయం రైతులకు ఏ లెక్కన సరిపోదన్నారు. పంటను బట్టి నష్టపరిహారం అందివ్వడంతో పాటు మళ్లీ ఉద్యాన పంటలు సాగుకు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నాయకులు కేశవరెడ్డి, గోపాల్, రమణ, రాజేష్‌గౌడ్, కుళ్లాయిస్వామి, కృష్ణుడు, ఆంజనేయులు, సంగప్ప, మలరాయుడు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం