
సమ్మె బాటలో ఎంఎల్‌హెచ్‌పీలు
● స్తంభించిపోనున్న ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ సేవలు
అనంతపురం మెడికల్: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్‌హెచ్‌పీ) సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు (గతంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు) స్తంభించిపోనున్నాయి. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఆవరణలో ఎన్‌హెచ్‌ఎం ఆఫీసర్ డాక్టర్ రవిశంకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్, కార్యనిర్వహణ కార్యదర్శి షేబా ప్రియాంక, కోశాధికారి గౌరి మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు 23 శాతం జీతం పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులకు అతీగతి లేకుండా పోయిందని, ఆరేళ్లుగా పని చేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెగ్యులరైజేషన్, జాబ్ చార్ట్ తదితర వాటిపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఆన్‌లైన్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 17న పీహెచ్‌సీల వద్ద ధర్నా, 19న డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట నిరసన, 21న పోస్టుకార్డు ఉద్యమం, 22న జిల్లా కేంద్రంలో ధర్నా, 24న నిరవధిక సమ్మెలోకి వెళ్తామని వెల్లడించారు.