
రూ.10 లక్షల విలువైన బైక్‌ల స్వాధీనం
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బత్తలపల్లి పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ ప్రభాకర్, ఎస్‌ఐ సోమశేఖర్ వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన ప్రణయ్, ధనూష్, సిద్ది వినయ్ వ్యసనాలకు బానిసలుగా మారి జులాయిగా తిరుగుతూ తమ జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించడాన్ని పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్లను కలుపుకున్నారు. వీరంతా కలసి ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. అనంతరం ఇతర రాష్ట్రాలకు చేరుకుని జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో బత్తలపల్లిలోని జాతీయ రహదారి కూడలిలో గురువారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు వెళుతుండగా స్థానిక పోలీసులు అడ్డుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బత్తలపల్లి, ధర్మవరం, అనంతపురం నగర పరిధిలో అపహరించిన 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలుగా ఉంటుందని నిర్ధారించారు. వీరిపై బత్తలపల్లిలో రెండు, ధర్మవరం టూ టౌన్ పరిధిలో మూడు కేసులు, అనంతపురంలో ఐదు కేసులున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మైనర్లను బాలుర పరివర్తన కేంద్రానికి తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన ఎస్‌ఐ సోమశేఖర్, సిబ్బందిని సీఐ ప్రభాకర్ అభినందిస్తూ రివార్డులను అందజేశారు.
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్